ఏపీ జీవనాడి పోలవరంపై రాజకీయ దాడి
posted on Jul 21, 2022 7:50AM
ఏపీకి జీవనాడి పోలవరంపై రాజకీయ దాడి ప్రారంభమైంది. పోలవరం ఎత్తుపై ఇరు రాష్ట్రాల మధ్యా వివాదం రగులు కొంది. రాజకీయ లబ్ధి కోసమే ఇరు రాష్ట్రాలలోని అధికార పార్టీలూ ఈ వివాదాన్ని లేపాయన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జూలై నెలలోనే భారీ వరదలు భద్రాచలాన్ని ముంచెత్తాయి. గోదావరి వరద ప్ర్తతి ఏటా సాధారణంగా వచ్చేదే.
అయతే ఈ ఏడాది ఆ వరద ఉదృతి ఒకింత తీవ్రంగా ఉంది. అయినా వరద పరిస్థితి, ప్రవాహ వేగం అంచనాలలో ప్రభుత్వాల వైఫల్యాన్ని పోలవరం మీదకు నెట్టివేయడాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు. బ్యాక్ వాటర్ తో భద్రాచలానికి ముంపు ముప్పు వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకోకుండానే డిజైన్ చేశారా? ఆ డిజైన్ కు కేంద్రం ఆమోద ముద్ర వేసిందా? దానికి రాష్ట్ర్ర విభజన సమయంలో ఎటువంటి అభ్యంతరాలూ చెప్పకుండానే కేసీఆర్ సహా తెలంగాణ నేతలందరూ ఆమోదించేశారా? ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలానికి ముంపు ముప్పు అంటున్న వారు సమాధానాలు చెప్పాలి. ఇప్పటి వరకూ రాజకీయ నాయకులే పోలవరం విషయంలో తమతమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యాఖ్యలు చేశారు, విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు తెలంగాణ నీటి పారుదల శాఖను ఆ రాష్ట్ర్ర ప్రభుత్వం రంగంలోకి దింపింది.
పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణలో ఏకంగా లక్ష ఎకరాల మేర పొలాలు మునకకు గురవుతాయని తెలంగాణ నీటిపారుదల శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. లక్షల ఎకరాల్లో పంటలతో పాటు భద్రాచలం, పర్ణశాల నీటిలో మునిగిపోతాయని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు. పోలవరం వల్లే భద్రాచలం మునిగిపోయిందని తెలంగాణకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యలు చేయడం, వాటిపై ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులు ఘాటుగా స్పందించిన నేపథ్యంలో రజత్ కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇంతకీ అసలు వాస్తవమేమిటంటే.. అన్ని దారులూ మూసుకుపోయి చివరకు గోదారే దిక్కు అయినట్లుంది తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీలకు. గోదావరి వరద సాక్షిగా సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపాయి వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు. ఇరు రాష్ట్రాలలోని ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిర్లిప్తత, యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో విఫలం కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాలలో వరదలు అపార నష్టానికి కారణమయ్యాయి.
ముఖ్యంగా రెండు రాష్ట్రాలూ కూడా వరద ప్రవాహాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యయి. అందుకే ముంపు ప్రాంతాల ప్రజలను తరలించడంలోనూ, ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంలోనూ సకాలంలో స్పందించలేకపోయాయి. దీంతో జనం రోజుల తరబడి వరద ముంపులో నానా ఇబ్బందులూ పడ్డారు. ఇప్పుడు, అసలే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ ప్రభుత్వ వ్యతిరేకతను తీవ్రంగా ఎదుర్కొంటున్న సమయంలో జనంలో వ్యతిరేకతను పక్కదోవ పట్టించడానికి వారు వరద రాజకీయాలకు తెరతీశారు. దాంట్లోనూ సెంటిమెంటును రంగరించి మరీ కలుపుతున్నారు.
ఎప్పుడో ఎనిమిదేళ్ల నాటి అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చి సెంటిమెంట్ పండించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే.. చుట్ట కాల్చుకోవడానికి నిప్పడిగాడట మరొకడు. అలాగుంది తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీల పరిస్థితి. జనం వరదల్లో భారీగా నష్టపోయి నిలువ నీడ లేక అల్లాడుతుంటే.. వారిని ఆదుకోవడం పక్కన పెట్టి ముంపునకు కారణాలను రాష్ట్ర విభజనతో ముడిపెడుతున్నారు. ముందుగా ఈ క్రీడను తెరాస ఆరంభిస్తే.. క్షణం ఆలస్యం చేయకుండా వైకాపా వచ్చి చేరిపోయింది. పోలవరం కారణంగానే భద్రాచలం మునిగిపోయిందంటూ పువ్వాడ విమర్శల పర్వానికి తెరతీసి విలీన మండలాల అంశం లేవనెత్తారు. ముంపు గ్రామాలను తెలంగాణలో కలిపేస్తే కరకట్ట ఎత్తు పెంచుకుని ముంపు ముప్పును శాశ్వతంగా పరిష్కరించుకుంటామన్నది పువ్వాడ వ్యాఖ్య. అయితే మేమేం తక్కువ తినలేదంటూ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులు తెలుగు రాష్ట్రాలు రెంటినీ విలీనం చేసి సమైక్య ఆంధ్ర కావాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్లు ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ఆగిపోలేదు. హస్తినలో ఇరు పార్టీల ఎంపీలూ పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఇక మళ్లీ పువ్వాడ వ్యాఖ్యల వద్దకు వస్తే..పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం మునిగిపోతుందని భద్రాచలంలోకి వరద నీరు ప్రవేశించకుండా, భద్రాచలం రామాలయం మునిగిపోకుండా కరకట్టలు నిర్మిస్తామని.. ఇందుకు దాని చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతే బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు వెంటనే వరదలు వచ్చినప్పుడు ముంపు సహజమేనని.. ఇందుకోసమే ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారని అంబటి అన్నారు. ఐదు గ్రామాలు కావాలంటే తామూ భద్రాచలం కావాలంటామన్నారు. ఇక బొత్స అయితే రాష్ట్ర విభజనతో హైదరాబాద్ ఆదాయాన్ని తాము కోల్పోయామని.. మరి ఆ నగరాన్ని ఏపీలో విలీనం చేయాలంటే చేసేస్తారా అని ప్రశ్నించారు.
ఇలా ఇరు రాష్ట్రాలలోని అధికార పార్టీలూ ప్రజల కష్టాలను, వరదల్లో వారు పడుతున్న ఇబ్బందులనూ వదిలేసి.. రాజకీయ లబ్ధి కోసం విభజన నాటి అంశాలను తెరమీదకు తీసుకురావడం వెనుక మరో సారి అధికారం చేపట్టాలంటే ప్రజలలో సెంటిమెంట్ రగల్చడమొక్కటే మార్గమన్న నిర్ణయానికి వచ్చేశారని అర్ధమౌతున్నది. అందుకే కూడబలుక్కునే ఈ విమర్శలు, ప్రతి విమర్శలు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఏడు మండలాలు ముంపునకు గురవుతాయి కనుకనే వాటిని అప్పట్లో ఏపీలో విలీనం చేశారన్నది జగద్వితం. ఆ మండలాల విలీనం తరువాతే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చంద్రబాబు అప్పట్లో విస్ఫష్టంగా కేంద్రానికి చెప్పి సాధించుకున్నారు.
ఇప్పుడు మళ్లీ ఆ విలీన మండలాలు తెలంగాణలో కలపాలంటూ టీఆర్ఎస్ చేస్తున్న డిమాండ్ సమస్యను పక్కదారి పట్టించి సెంటిమెంటును రగల్చడానికేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ మంత్రులు భద్రాచంల, హైదరాబాద్, సమైక్యాంధ్ర అంటూ చేస్తున్న వాదనలు కూడా ఇక్కడి సమస్యలను పక్కదారి పట్టించి మళ్లీ ఇరు రాష్ట్రాల ప్రజల మధ్యా విభజన నాటి సెగలు రేపే ప్రయత్నం తప్ప మరొకటి కాదని అంటున్నారు. ఇక ఏపీ జల వనరుల శాఖ మంత్రి ఎగువ కాపర్ డ్యాం ను ఆఘమేఘాల మీద మీటర్ ఎత్తును పెంచేశామనీ, దాని వల్లే పెనుముప్పు తప్పిందనీ చెప్పడం నేల విడిచి సాము చేశాం అని చెప్పుకోవడమే తప్ప ఒక్క రోజులో ఒక మీటర్ ఎత్తు పెంచామనడం ఏ విధంగానూ నమ్మశక్యంగా లేదని చెబుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో స్వయంగా తెలంగాణ అసెంబ్లీ వేదికగా పోలవరం ఎత్తు తగ్గించేందుకు జగన్ అంగీకరించారని ప్రకటించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. పార్లమెంటు వేదికగా పోలవరం నిర్మాణంలో జాప్యానికి ఏపీలోని జగన్ సర్కార్ నిర్వాకమే కారణమని కేంద్ర జలశక్తి మంత్రి ప్రకటించిన రోజునే ఏపీ సర్కార్ పోలవరం పనులు జెట్ స్పీడ్ లో సాగుతున్నాయని ఏపీ చెప్పుకోవడానికి ప్రయత్నించడం రాజకీయ లబ్ధి కోసం తప్ప మరొకందుకు కాదని, అలాగే పోలవరం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతోందనీ, భద్రాచలం రామాలయం ఉనికే ప్రశ్నార్థకమౌతోందని తెలంగాణ గుండెలు బాదుకోవడం కూడా జనంలో సెంటిమెంట్ రగిల్చి రాజకీయ పబ్బం గడుపుకోవడానికేననీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్లు రాజకీయంగా ఇబ్బందులు తలెత్తినప్పుడల్లా ఏపీ సర్కార్ హైదరాబాద్ ఆదాయం కోల్పోయామనీ, కేసీఆర్ సర్కార్ ఆంధ్రాపాలకుల దోపిడీ ఇంకా ఆగడం లేదనీ సెంటిమెంట్ ను ఆశ్రయించడం పరిపాటిగా మారిపోయిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు జనానికి కావలసింది సెంటిమెంట్ డ్రామాలు కాదనీ, బాధల్లో ఉన్న వారికి తక్షణ సాయం అందించడమనీ అంటున్నాయి. మొత్తంగా గోదావరి వరదను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న రెండు పార్టీల డ్రామాపై సామాజిక మాధ్యమంలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.