రాజకీయ అవినీతిని రూపుమాపాలి!
posted on Sep 26, 2022 8:37AM
జగన్ ఆర్థిక నేరాల కేసు దర్యాప్తు సందర్భంగా అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఎన్నో బెదరింపులను ఎదుర్కొన్నారు. కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదరింపుల లేఖలు వచ్చాయి. ఒక సారైతే ఆయనపై ఏకంగా దాడి యత్నమే జరిగింది. అయితే నాడు కేసు దర్యాప్తు సందర్భంగా ఆయన ఈ విషయాలను స్వయంగా ఎన్నడూ ఎక్కడా బయటపెట్టలేదు. నిజాయితీగా పని చేయడమే ముఖ్యమనుకున్నారు.
అన్ని బెదరింపులను, దాడి యత్నాలనూ మౌనంగానే ఎదుర్కొన్నారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. జగన్ అరెస్టు కూడా అయ్యారు. అదంతా గతం. అయితే తాను గతంలో ఎదుర్కొన్న బెదరింపుల విషయాన్ని జేడీ తాజాగా బయటపెట్టారు. అది కూడా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఆధ్వర్యంలో తనకు ఆదివారం జరిగిన సత్కార కార్యక్రమంలో ఆయనీ విషయాన్ని వెల్లడించారు. నిజాయితీగా ఉండాలనుకునే వారికి కష్టాలు తప్పవని చెప్పారు. నిజాయితీగా ఉన్న తనకూ ఆ బాధలు తప్పలేదని వెల్లడించారు.
జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు సందర్భంగా అప్పట్లో తనకు తీవ్రంగా బెదరింపులు వచ్చాయనీ, దాడి యత్నాలు కూడా జరిగాయనీ వెల్లడించారు. తననే కాదు, తన కుటుంబాన్ని కూడా చంపేస్తామంటూ రెడ్ ఇంక్ తో రాసిన బెదరింపు లేఖలు వచ్చాయన్నారు. రాజకీయ అవినీతిని రూపుమాపితే తప్ప సమాజంలో మార్పు రాదని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. రాజకీయాలలో ప్రజా సేవ కంటే అవినీతి, స్వార్థం పెచ్చరిల్లాయనీ, వాటిపై దృష్టి సారించాలని అన్నారు. రాజకీయ అవినీతిని రూపు మాపితే అన్నీ దారిలోకి వస్తాయన్నారు.