ఏపీలో భారీ పోలింగ్.. దెబ్బపడిందెవరికో తెలుసా?
posted on May 15, 2024 9:06AM
ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు గతంలో ఎన్నడూ లేనంద ఆసక్తి చూపారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఏదైనా జనజాతర జరుగుతోందా అన్నట్లుగా జనం పోటెత్తారు. రాష్ట్రం నుంచి వెళ్లి తెలంగాణ, తమిళనాడు, కర్నాటక.. ఇలా దేశంలోని వివిధ ప్రాంతాలలో పొట్టకూటి కోసం పనులు చేసుకుంటున్నవారూ, ఉద్యోగాలు చేసుకుంటున్నవారూ.. రాష్ట్ర భవిష్యత్ కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అంటూ తండోపతండాలుగా తరలి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఒక్క హైదరాబాద్ నుంచే దాదాపు పది లక్షల మంది ఏపీకి వచ్చి తమతమ స్వగ్రామాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారంటే రాష్ట్రం పట్ల వారెంత అక్కరతో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇతర ప్రాంతాల నుంచి పని గట్టుకు మరీ వచ్చి ఓటు వేసిన వారిలో 98 శాతం మంది కూటమికే ఓటు వేశారని మీడియా పేర్కొంది. పరిశీలకులు విశ్లేషించారు. అసలు అన్ని లక్షలమంది ఓటు వేయడానికి గతంలో ఎన్నడూ లేనంత ఆసక్తితో, పట్టుదలతో తమ స్వరాష్ట్రం ఆంధ్రకు ఎందుకు తరలివచ్చారు. జరుగుతున్నది సార్వత్రిక ఎన్నికలు. ఏపీలో అసెంబ్లీకి కూడా జరిగాయనుకోండి అది వేరే విషయం. తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రులకు అక్కడ కూడా ఓటు హక్కు ఉంది. రెండు చోట్ల ఓటు ఉండటం కరెక్ట్ కాదు. అయినా అలా ఓటు ఉన్న వారు ఉభయ తెలుగు రాష్ట్రాలలో కోకొల్లలు. ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం ఏమిటంటే.. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ స్థిరపడిన ఆంధ్రులు అక్కడే ఓటు వేయచ్చు. కానీ హైదరాబాద్‌లో, లేదో తెలంగాణలో మరో చోట ఓటు ఉన్న వాళ్లు అక్కడ ఓటు వేయకుండా.. ఎండను, రద్దీని లెకక్క చేయకుండా వ్యయప్రయాసలకోర్చి ఏపీ వచ్చి మరీ ఓటు వేశారంటే ఏమనుకోవాలి.
జగన్ ఐదేళ్ల పాలనలో సంక్షేమం పేరిట పప్పు బెల్లాలకు సరిపోయేలా సొమ్ముల పందేరం తప్ప జరిగిన అభివృద్ధి శూన్యం. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదు. ఉద్యోగాలు లేవు. వ్యవసాయం పడకేసింది. నిర్మాణరంగం నిర్వీర్యమైపోయింది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. దీంతో రాష్ట్రం నుంచి వలసలు పెరిగాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై.. ఇంకా దేశం విడిచి పొట్ట చేత పట్టుకుని ఉన్న ఊరుకు, కన్నవారికీ దూరమై ఎవరి స్థాయిలో వారు ఉద్యోగాలో, ఉపాధో వెతుక్కుంటూ వెళ్లిపోయారు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వం మారితే పరిశ్రమలు వస్తాయి, పారిశ్రామికాబివృద్ధి జరుగుతుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న ఆశతో కష్టమైనా, భరించలేని వ్యయం అయినా రాష్ట్రంలో ప్రభుత్వం మారాలి అన్న ఒకే ఒక్క ఆశయంతో, ఆకాంక్షతో, సంకల్పంతో ఇన్ని లక్షల మంది ఆంధ్రాకు తరలి వచ్చి మరీ ఓటు వేశారు. ఇంత చెప్పుకున్న తరువాత కూడా ఏపీలో ఓట్ల వెల్లువతో ఎవరికి దెబ్బపడిందన్నది ప్రత్యేకంగా చెప్పాలా?