పోలీస్ చేతిలో డబ్బు బ్యాగ్.. డబ్బు కట్టలతో బీజేపీ కార్యకర్తల పరుగులు!
posted on Oct 26, 2020 @ 10:02PM
దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇళ్లు, కార్యాలయాలతో పాటు.. సిద్దిపేటలోని రఘునందన్ మామ, బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రఘునందన్ మామ ఇంట్లో రూ.18.67 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల విషయం తెలుసుకున్న రఘునందన్.. దుబ్బాకలో తన ప్రచారాన్ని మధ్యలోనే నిలిపివేసి, అక్కడి నుంచి ఆయన సిద్దిపేటలోని తన మామ ఇంటికి చేరుకున్నారు. అయితే, ఆయన ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కొందరు బీజేపీ కార్యకర్తలు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి.. స్వాధీనం చేసుకున్న నగదును తీసుకొని పరుగులు తీశారు.
అయితే, రఘునందన్ బంధువుల ఇంట్లో రూ.18.67 లక్షలు స్వాధీనం చేసుకున్నామని, కొందరు వాటిని లాకున్నారని పోలీసులు చెప్తుండగా.. బీజేపీ శ్రేణులు మాత్రం పోలీసులే అక్కడకు డబ్బు తెచ్చారని ఆరోపిస్తున్నారు. వేరే ఇంట్లో దొరికిన డబ్బులను రఘునందర్ మామ ఇంట్లో పెట్టేందుకు పోలీసులే డబ్బు తీసుకొచ్చారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. అంతేకాదు, పోలీస్ డబ్బు బ్యాగ్ తీసుకొస్తున్న దృశ్యాలను కార్యకర్తలు రికార్డ్ కూడా చేశారు. ఆ వీడియోలో పోలీస్ డబ్బులు తీసుకురావడం, వాటిని కార్యకర్తలు లాక్కొని వెళ్లి బయటున్న మీడియాకి, జనాలకి చూపించడం కనిపిస్తోంది. అయితే, అది పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బా? లేక పోలీసులు రఘునందర్ మామ ఇంట్లో పెట్టేందుకు తెచ్చిన డబ్బా? అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.