ఖాకీవనంలో గంజాయి మొక్కలు
posted on Jul 14, 2023 @ 9:50AM
పోలీస్ శాఖకు పర్యాయపదం.. బాసిజం. ఆ శాఖలో ప్రతీ దశలో బాసిజమే రాజ్యమేలుతోందన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి శాఖలో క్రమానుగత శ్రేణిని బట్టి పరిశీలిస్తే.. ఒకరిపై ఒకరు పెత్తనం చేసుకోవడం అనేది అనాదిగా ఉన్నదే. అయితే అటువంటి శాఖలో మహిళా అధికారులు అతి కొద్దిమందే ఉన్నా.. వారిలో పలువురు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదని.. వారి చర్యలతో ఖాకీ దుస్తుల ప్రతిష్ట మసకబారేలా ఉందన్న చర్చ ప్రస్తుతం ఊపందుకొంది.
పోలీసు అధికారుల్లో పురుషులు కరుకుగా, అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారంటే అందులో అర్థం.. పరమార్థం ఉందనుకోవచ్చు. కానీ ఖాకీ దుస్తులు వేసుకొన్న ఆడవారు సైతం.. ఫురుషులతో పోటీ పడేలా అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడం, శాంతిభద్రతలు పరిరక్షణలో భాగంగా ప్రజలతో రుబాబుగా , దురుసుగా వ్యవహిరిస్తున్న పలు సంఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా చోటు చేసుకొంటున్నాయి. అలాంటి సంఘటనలపై ప్రజాస్వామిక వాదులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి సీఐ అంజుయాదవ్... తన రెండు చేతులతో జనసేన పార్టీకి చెందిన వ్యక్తి చెంపలను వాయించారు. అందుకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. అంతేకాదు.. సీఐ వ్యవహార శైలిపై ఇప్పటికే స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే విశాఖపట్నంలో ఆర్మీ రిజర్వుడు సీఐ స్వర్ణలత సైతం నోట్ల మార్పిడి వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి.. ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నారు.
మరోవైపు.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్ అధికారి సౌమ్య మిశ్రా విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో నగరంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఆమె బదిలీపై వెళ్లిపోతూ.. ప్రస్తుత టీడీపీ నాయకుడు వంగవీటి రాధా తల్లి వంగవీటి రత్నకుమారిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి మరీ వెళ్లిపోయారు.
అలాగే సౌమ్య మిశ్రా విశాఖ డీజీపీగా ఉన్న సమయంలో శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా శ్రీకాంత్ బాధ్యతలు చేపట్టి.. తనపై అధికారి సౌమ్య మిశ్రాను కలిసేందుకు విశాఖలోని ఆమె కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆమె లేకపోవడం.. తాను వచ్చిన విషయాన్ని పర్యటనలో ఉన్న ఆమెకు తెలియజేశారు. అయితే తాను పర్యటనకు వచ్చానని. తాను వచ్చే పరకు తన కార్యాలయంలో వేచి ఉండాలంటూ.. సూచించారు.
కానీ ఆమె తన కార్యాలయానికి రావడం ఆలస్యం కావడంతో.. శ్రీకాంత్.. తన నివాసం శ్రీకాకుళం వెళ్లిపోయారు. ఆ తర్వాత సౌమ్యా మిశ్ర.. శ్రీకాంత్‌పై కక్ష సాధింపు చర్యలకు సదరు డీఐజీ శ్రీకారం చుట్టారనే ఓ ప్రచారం సైతం నాడు ఊపందుకొంది. ఇలా పోలీస్ శాఖలోకి ప్రవేశించే స్త్రీ శక్తులు.. తమ శౌర్య ప్రతాపాలతో.. ప్రజా రక్షణ కోసం తహతహలాడాల్సింది పోయి.. అక్రమ నగదు కోసం ఒకరు.. ఖాకీ పవర్ చూపించడం కోసం మరొకరు.. ఈగోల సమస్యలతో ఇంకొకరు.. కనిపించని నాలుగో సింహం అయిన ఖాకీవనంలో గంజాయి మొక్కలుగా మిగిలిపోక తప్పదని ప్రజాస్వామిక వాదులు ఓ విధమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.