ఉండవల్లి అనూషకు నోటీసులు
posted on Sep 7, 2022 @ 3:26PM
తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఐటీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి అనూషకు అనంతపురం జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పద్మావతిపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టారన్న అభియోగంపై ఉండవల్లి అనూషకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఏలూరు నగరంలోని ఆర్ఆర్ పేటలోని ఉండవల్లి అనూషకు చెందిన బట్టల దుకాణానికి వచ్చి.. అనంతపురం పోలీసులు.. ఆమెకు 41ఏ నోటీసులు అందజేశారు. అయితే సోషల్ మీడియాలో ఎమ్మెల్యేపై పెట్టిన పోస్టులపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆమె పోలీసులు స్పష్టం చేశారు. లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తేల్చి చెప్పారు.
మరోవైపు తనకు అందిన నోటీసులపై ఉండవల్లి అనూష స్పందించారు. ఈ నోటీసుల్లో పేర్కొన్న సోషల్ మీడియా ఐడీలు తనవి కావని ఆమె స్పష్టం చేశారు. ఎవరో తప్పుడు ఫిర్యాదు చేస్తే... అనంతపురం జిల్లా పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఇది ముమ్మమాటికి ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఉండవల్లి అనూష వెల్లడించారు. శింగనమల ఎమ్మెల్యే పద్మావతిపై అసభ్యకరపోస్ట్‌లు పెట్టారంటూ...భీమిశెట్టి శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శింగనమల పీఎస్‌లో ఉండవల్లి అనూషపై పోలీసులు కేసు నమోదు చేసి... నోటీసులు జారీ చేశారు.
టీడీపీ కార్యకర్తగా ఉండవల్లి అనూష.. వైయస్ జగన్ ప్రభుత్వం చేసిన.. చేస్తున్న తప్పులను.. సోషల్ మీడియా సాక్షిగా ఎత్తి చూపుతూ.. ప్రశ్నిస్తున్నారు. ఆ క్రమంలోనే అధికార పార్టీ నేతలు వరుస ప్రెస్ మీట్లు పెట్టి.. ప్రతిపక్ష టీడీపీపై విమర్శలు గుప్పిస్తోంటే.. వాటికి సైతం ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లు ఉండవల్లి అనూష.. కౌంటర్ ఎటాక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే జగన్ ప్రభుత్వంపై సోషల్ మీడియా సాక్షిగా విమర్శలు గుప్పిస్తే.. వారిపై పలు సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేసి.. వారిని నోటీసులు జారీ చేస్తున్న విషయం విదితమే.