అమ్మను తిట్టి.. అన్నం పెట్టి.. మృత్యువాత
posted on Mar 25, 2021 @ 3:07PM
తప్పు చేసిన వాడిని ఆ దేవుడే శిక్షిస్తాడు అనే మాట తరచు వింటుంటాం.. కానీ ఈ సంఘటన చూశాక అది నిజమనే అనుకుంటాం. కొన్ని తప్పులకు సంవత్సరాలైనా శిక్షలు పడవు. కొన్నీ తప్పులకు వెంటనే శిక్షలు పడుతుంటాయి. రోజురోజుకు జనాలకు నోటి దురుసు ఎక్కువ అవుతుంది.. అలా నోటి దురుసు ఉన్న కానిస్టేబుల్ కి ఏమైంది ఒక్కసారి మీరే చూడండి..
ఖాకీలైన కామన్ మ్యాన్ అయినా.. ఖద్దరు వేసేవాళ్ళైనా మందు మందే వేస్తే ఢిల్లీ రాజకీయాల నుండి మొదలుకుని.. గల్లీ వరకు మాట్లాడుకుంటారు. అక్కడి వరకు మాట్లాడుకుంటే అందరికి మంచిదే.. కానీ మద్యం మత్తులో ఇంట్లో వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఎలా ఉంటుంది. చీము నెత్తురు ఉన్న ఏ మగాడికైనా రక్తం మరుగుతుంది.. ఆ తర్వాత గొడవ మొదలవుతుంది.
ముగ్గురు కానిస్టేబుల్స్ మందు పార్టీ చేసుకున్నారు. ఆ విందులో తోటి కానిస్టేబుల్ పట్ల మరో కానిస్టేబుల్ నోరు జారాడు. దీంతో జరిగిన తప్పిదాన్ని క్షమాపణ కోరాలనుకున్నాడు. చివరికి హెడ్ కానిస్టేబుల్ బకెట్ తన్నేశాడు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా బైంసా మండలం గ్రామానికి చెందిన సత్యపాల్ రెడ్డి నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి పోలీస్ బెటాలియన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. డిచ్ పల్లి బెటాలియన్ లో సత్యపాల్ రెడ్డి, సంతోష్ తో పాటు మరో ఇద్దరు కలిసి విందు చేసుకున్నారు. మద్యం తాగుతున్న సమయంలో సంతోష్ తల్లిని సత్యపాల్ రెడ్డి దూషించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
అయితే సంతోష్ తల్లికి క్షమాపణలు చెప్పేందుకు సత్యపాల్ రెడ్డి బెటాలియన్ నుంచి రాత్రి 10 గంటల సమయంలో నందిపేట్ మండలం సిద్ధాపూర్ గ్రామానికి ద్విచక్ర వాహనం పై బయలుదేరాడు.. సిద్ధాపూర్ కు చేరుకున్న సత్యపాల్ రెడ్డి ’మద్యం మత్తులో వాగాను తనను క్షమించమని సంతోష్ తల్లికి కోరాడు. తప్పయిపోయిందని క్షమించమ్మా‘ అని వేడుకున్నాడు. ఎంతైనా తల్లి మనసు కదా ఆ తల్లి కూడా సంతోషంగా క్షమించింది. బోజనం కూడా పెట్టింది. భోజనం చేసి అక్కడి నుంచి సత్యపాల్ రెడ్డి బయల్దేరాడు. తన ఫోన్ స్విచాఫ్ రావడంతో ఆనుమానం వచ్చి తోటి కానిస్టేబుల్ సత్యపాల్ ను వెతుక్కుంటూ వచ్చారు.. బుధవారం వేకువజామున సత్యపాల్ రెడ్డి బైక్ మాచర్ల శివారులోని రోడ్డు పక్కన పడివుంది. అయితే రోడ్డు పక్కనే వ్యవసాయ బావి ఉండడంతో వారు డయల్ 100కు సమాచారం అందించారు.
ఆర్మూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో వ్యవసాయ బావిలో గాలించగా సత్యపాల్ రెడ్డి మృతదేహం లభించింది. ఘటన స్థలంలో బైక్ అదుపు తప్పిన ఆధారాలు కనిపించడంతో. సత్యపాల్ రెడ్డి బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సత్యపాల్ రెడ్డి మృతిపై అనుమానాలు ఉన్నట్లు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.