ఆర్టీసీ బస్సులో తాగుబోతుల వీరంగం.. డ్రైవర్, కండక్టర్ ఏం చేశారంటే...
posted on Dec 11, 2020 @ 2:42PM
తాగి బస్సు నడపడం నేరం కానీ.. బస్సులో తాగి హంగామా చేయడం నేరం కాదు అనుకున్నారో ఏమో... ఐదుగురు తాగుబోతులు ఆర్టీసీ బస్సులో వీరంగం సృష్టించారు. ఈ ఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. గత రాత్రి మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ కు వెళ్తున్న ఆర్టీసి బస్సులో ఐదుగురు యువకులు ఎక్కారు. వారు బస్సులోనే బీరు తాగుతూ నానా హంగామా సృష్టించారు. మహిళలు, పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా అసభ్యంగా ప్రవర్తిస్తూ.. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించారు. వీరి చేష్టలతో విసిగిపోయిన ఆ బస్సు డ్రైవర్, కండక్టర్ బస్సును మార్గ మధ్యలో తాండురు వద్ద నిలిపి 100 కు డయల్ చేశారు. దీంతో తాండూరు సీఐ పెట్రోలింగ్ సిబ్బందితో కలిసి రంగంలోకి దిగి తమ లాఠీలకు పని చెప్పారు. అనంతరం పోకిరీలను స్టేషన్ కు తరలించారు. ఈ ఐదుగురు యువకులు మహారాష్ట్రకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.