వైకాపా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అరెస్ట్
posted on Nov 15, 2015 @ 6:20PM
గుడివాడ పోలీసులు స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానిని ఆదివారం గుడివాడలో అరెస్ట్ చేసారు. గుడివాడలో సుశీల అనే ఆమెకు చెందిన ఒక భవనంలో వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకొన్నారు. కానీ గత కొన్ని నెలలుగా ఆ భవనానికి వైకాపా నేతలు అద్దె చెల్లించడం లేదు. దానితో ఆమె తన భవనాన్ని ఖాళీ చేయమని కోరుతున్నారు. కానీ వైకాపా నేతలు పట్టించుకోకపోవడంతో ఆమె పోలీసులకు పిర్యాదు చేసి వైకాపా కార్యాలయానికి తాళం వేసేసారు. ఆమె అభ్యర్ధన మేరకు ఆ భవనం వద్ద పోలీసులు మొహరించారు. ఆ సంగతి తెలుసుకొన్న కొడాలి నాని తన అనుచరులతో కలిసి అక్కడికి వచ్చి తమకు తెలియజేయకుండా తమ పార్టీ కార్యాలయానికి తాళం వేసినందుకు ఆమెతో, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు కొడాలి నానిని అరెస్ట్ చేసి ముదినేపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. వైకాపాను అప్రదిష్టపాలుజేయడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ కార్యాలయానికి పోలీసుల చేత మూసివేయించారని ఆరోపించారు.