ప్రధాని మోడీ కన్నీళ్లు.. కరోనాను జయిద్దామని పిలుపు
posted on May 21, 2021 @ 3:33PM
దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజూ 4 వేల మందికిపైగా వైరస్ భారీన పడి చనిపోతున్నారు. అధికారిక లెక్కల కంటే అనధికారికంగా చనిపోయే వారి సంఖ్య భారీగా ఉంటుందని చెబుతున్నారు. పట్టణం, పల్లె తేడా లేకుండా కరోనా విజృంభిస్తోంది. గంగా నదిలో శవాలు కొట్టుకుని రావడం కలకలం రేపింది. హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక రోగులు విలవిలలాడుతున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉంటున్నాయి. దేశంలో కరోనా మహమ్మారి నిత్యం వేలమందిని బలితీసుకోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కొవిడ్ పరిస్థితులపై ఉత్తరప్రదేశ్‌లోని తన లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసికి చెందిన డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలతో ప్రధాని మోదీ నేడు వర్చువల్‌గా సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆరోగ్య కార్యకర్తలతో మాట్లాడిన ప్రధాని.. వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
‘‘ఈ వైరస్ ఎంతోమంది ప్రియమైన వారిని మన నుంచి తీసుకెళ్లింది. వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని మోడీ తడారని గొంతుతో చెప్పారు. ‘కరోనా వైరస్ మన ఆత్మీయులను దూరం చేసింది. ఆ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రెండోదశలో ఒకే సమయంలో బహుముఖ పోరాటం చేయాల్సి వస్తోంది. కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. బాధితులు ఎక్కువ సమయం ఆసుపత్రుల్లో ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతోంది’ అని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో యోగా మంచి ఫలితాన్నిచ్చిందన్నారు. అయితే వైరస్‌పై మనం చేయాల్సిన పోరాటం ఎంతో ఉందన్నారు ప్రధాని.
గ్రామీణ ప్రాంతాల్లోకి చొరబడుతున్న కరోనాపై వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాని మోడీ గుర్తుచేశారు. ఎక్కడ అనారోగ్యం ఉందో..అక్కడ చికిత్స ఉండాలన్నారు. మనం ప్రజల్ని ఎంత క్షేమంగా చూసుకుంటే..వైద్య వ్యవస్థపై అంత తక్కువ ఒత్తిడి పడుతుందని చెప్పారు. కొవిడ్ 19 నుంచి చిన్నారులను రక్షించాల్సి ఉందన్నారు. గతంలో పిల్లలపై ప్రభావం చూపిన పలు వ్యాధులపై మనం విజయం సాధించామని చెప్పిన మోడీ.. చిన్నారులను సురక్షితంగా ఉంచేందుకు వీలుగా సాధ్యమైన ఉత్తమ పద్ధతులను వాడాలని వైద్యులను ప్రోత్సహించారు.
కల్లోల సమయంలో బ్లాక్ ఫంగస్ సవాలు విసురుతోందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. దీనిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ‘ఇటీవలి కాలంలో బ్లాక్ ఫంగస్ కొత్త సవాలు విసురుతోంది. దాని కట్టడికి వీలుగా వ్యవస్థను సిద్ధం చేయాలి’ అని సూచించారు.