Read more!

ప్లాస్టిక్ బాటిల్ లో నీరు తాగుతున్నారా? అయితే  ఈ నిజాలు తెలుసుకొండి?

ఇంట్లో ఉన్నప్పుడు టీవీ చూస్తున్నా, ఏదైనా పని చేసుకుంటున్నా  పక్కనే ఒక ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు పెట్టుకుని ఉంటారు. ఇక భోజనం చేసేటప్పుడు అయితే ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని ప్లాస్టిక్ బాటిళ్లతో నీళ్ళు పక్కన పెట్టుకుంటారు. రాత్రి నిద్రపోయే ముందు పక్కనే ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్ళు పెట్టుకుంటారు.  ఇక బయటకు వెళ్లినా  వెంట ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్ళు తీసుకెళ్లాల్సిందే. లేకపోతే బయట 20 నుండి 30 రుపాయలు పెట్టి నీళ్ళ బాటిల్ కొనాల్సి వస్తుంది. ఎక్కడైనా తాగుదామా అంటే పరిశుభ్రత గురించి, నీటి క్వాలిటీ గురించి ఆలోచిస్తాం. కొందరు అయితే ఆరోగ్యం మీద స్పృహతో ప్రయాణాలలోనూ, హోటళ్లలోనూ వాటర్ బాటిళ్లు కొనుగోలు చేసి నీరు తాగుతారు. కానీ ఇలా బాటిళ్లలో నీరు తాగడం అంత మంచిది కాదని ఎప్పటినుండో చెబుతున్నా ఇప్పుడు ఓ దారుణమైన నిజం బయటపడింది. ప్లాస్టిక్ బాటిళ్ళలో నీరు తాగడం గురించి శాస్త్రవేత్తలు షాకింగ్ నిజాలు బయటపెట్టారు.

అందరూ వాటర్ బాటిళ్లలో నీరు తాగుతారు. ఇంట్లో అయినా, బయట నేరుగా బాటిళ్లతో కొనే నీరు అయినా పరిశుభ్రంగా ఉన్నాయని అనుకుంటారు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు  డబుల్ లేజర్ సూక్ష్మదర్శిని ఉపయోగించి ఈ బాటిళ్లలో నీటిని పరిశీలించగా దిమ్మతిరిగిపోయే విషయాలు బయటపడ్డాయి. సగటు లీటర్ వాటర్ బాటిల్ లో రెండు మిలియన్ల కంటే ప్లాస్టిక్ ముక్కలు సూక్ష్మరూపంలో ఉంటాయట. ఇవి అదృశ్యరూపంలో ఉండే నానోప్లాస్టిక్ ముక్కలుగా తేలింది.

కొలంబియా,  రట్జర్స్ విశ్వవిద్యాలయాల పరిశోధకులు మూడు సాధారణ బాటిల్ వాటర్ బ్రాండ్‌ల నుంచి  ఐదు బాటిళ్ల నీటిని  పరిశీలిస్తే, ఒక లీటరు నీటిలో 1,10,000, మరొక దాంట్లో  4,00,000 ఇలా ఉన్నాయి. మొత్తం మీద  ప్లాస్టిక్ ముక్కల సంఖ్య ప్రతి బాటిల్ కు  సగటున 2,40,000 ఉన్నాయి.  ఇవి ఒక మైక్రాన్ కంటే తక్కువ పరిమాణంలో ఉండే కణాలు. ఒక అంగుళంలో 25,400 మైక్రాన్లు ఉంటాయి.  ఇది మీటర్‌లో మిలియన్ వంతు. కాబట్టి మైక్రోమీటర్ అని కూడా పిలుస్తారు. మనిషి  జుట్టు దాదాపు 83 మైక్రాన్ల వెడల్పు ఉంటుంది.

ఇంతకు ముందు ప్లాస్టిక్ బాటిళ్లలో నీటి గురించి జరిపిన అధ్యయనంలో 5 మిల్లీమీటర్ల నుండి పావు అంగుళం కంటే తక్కువగానూ, ఒక మైక్రాన్ వరకు ఉండే కొంచెం పెద్ద మైక్రోప్లాస్టిక్‌లను కనుగొన్నాయి. మైక్రోప్లాస్టిక్‌ల కంటే బాటిల్ వాటర్‌లో దాదాపు 10 నుండి 100 రెట్లు ఎక్కువ నానోప్లాస్టిక్‌లు ఉన్నాయని అధ్యయనాలు కనుగొన్నాయి.  ప్లాస్టిక్ బాటిళ్లలో ఇలాంటి నీరు తాగడం వల్ల కలిగే ఇబ్బందులు  ఏమిటంటే..  ఈ చిన్న కణాలు మెదడుకు రక్త సరఫరాకు అంతరాయం కలిగించడం,   వివిధ అవయవాలు,  క్రాస్ మెమ్బ్రేన్‌లను ప్రభావితం చేయడం చేస్తాయి. అదే విధంగా  ఈ  నానోప్లాస్టిక్‌లు పేగుల్లో పేరుకుపోయి వాటిని నిరోధించే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు ఈ కణాలు మెల్లిగా రక్త నాళాల వైపు కదులుతాయి.

మనిషి  శరీరంలో ఆల్వియోలస్ అనేది ఊపిరితిత్తుల భాగం. ఇది రక్తంలోకి ఆక్సిజన్‌ను విడుదల చేయడానికి,  రక్తం నుండి కార్బన్ డయాక్సైడ్‌ను స్వీకరించడానికి పెద్ద రంధ్రాలను కలిగి ఉంటుంది. ఈ కణాలు ఊపిరితిత్తులలోకి ప్రవేశించి రక్తం-గాలి ప్రసరణకు అవరోధాన్ని కలిగిస్తాయి. మరీ ముఖ్యంగా చిన్న ప్లాస్టిక్ కణాలు గర్భవతులలో మావిని ప్రభావితం చేస్తాయి. తల్లీబిడ్డలను కలిపే  అవయవం మావి. ఇది ప్రభావితం కావడం వల్ల  ఆక్సిజన్,  పోషకాలను తల్లి నుండి పిండానికి రవాణా చేయడం కష్టతరమవుతుంది.

                                              *నిశ్శబ్ద.