Read more!

రాహుల్ అనర్హతపై సుప్రీంలో పిల్

క్రిమినల్ డిఫమేషన్ కేసులో దోషిగా తేల‌డంతో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌స‌భ స‌భ్య‌త్వం ర‌ద్దు అయిన నేప‌థ్యంలో ఆయనపై అనర్హత వేటు వేసిన ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8(3) చెల్లుబాటును సవాలు చేస్తూ  సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం  (పిల్) దాఖలైంది.

రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల జైలు శిక్ష పడితే ఆటోమెటిక్‌గా ప్ర‌జాప్ర‌తినిధుల్ని అన‌ర్హులుగా ప్ర‌క‌టించే సెక్ష‌న్ 8   ఏక‌ప‌క్షంగా ఉంద‌ని పిటిషనర్ ఆరోపించారు. ప్రజా ప్రాతినిధ్య‌ చట్టంలోని సెక్షన్‌ 8 (3) రాజ్యాంగ చెల్లుబాటును కూడా పిటిష‌న‌ర్ సవాల్ చేశారు.

కేరళకు చెందిన స్కాలర్, సామాజిక కార్యకర్త మురళీథరన్ ఈ పిల్ దాఖలు చేశారు.  సెక్ష‌న్ 8(3)  రాజ్యాంగ స్ఫూర్తికి వ్య‌తిరేక‌ంగా ఉందని ఆయన తన పిల్ లో  పేర్కొన్నారు. ఈ సెక్షన్ ఎంపీలు, ఎమ్మెల్యేల భావ ప్రకటనా స్వేచ్ఛ‌ను హరించేదిగా ఉందని పేర్కొన్నారు.

‘మోడీ ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసులో సూర‌త్ కోర్టు ఇటీవ‌ల రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడం, ఆ వెంటనే  రాహుల్ గాంధీ లోక్‌స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేస్తూ లోక్‌స‌భ స‌చివాల‌యం నోటిఫికేషన్ విడుదల చేయడం తెలిసిందే.