బీఆర్ఎస్ నేతల మెడకు ఫోన్ ట్యాపింగ్ కేసు?!
posted on Apr 8, 2024 @ 12:37PM
తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు ఎన్నికలకు మించిన హీట్ పుట్టిస్తున్న విషయం ఏదైనా ఉందా అంటే అది ఫోన్ ట్యాపింగ్ కేసు మాత్రమే. ఈ కేసు దర్యాప్తు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. రోజు కొకరు చొప్పున తామూ ఫోన్ ట్యాపింగ్ బాధితులమే అంటూ తెరమీదకు వస్తున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే తన ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని ఆరోపించగా, తాజాగా బీజేపీ మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి ఈటల రాజేందర్ బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో మొదటి వాడిని తానేనని చెప్పారు.
ఇక ఈ కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచడంతో రోజు రోజుకూ ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఇద్దరు పోలీసులు అరెస్టయ్యారు. ఇక ఈ కేసులో అరెస్టయిన వారి నుంచి రాబట్టిన సమాచారంతో కొత్త కొత్త పేర్లు తెరమీదకు వస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా పోలీసులు తీగలాగుతుంటే డొంక కదులుతోంది.
తాజాగా పోలీసులు సోమవారం ( ఏప్రిల్ 8) జూబ్లీ హిల్స్ లోని ఓ గెస్టు హౌస్ లో సోదాలు చేపట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన వారి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగానే ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. పోలీసులు సోదాలు చేపట్టిన గెస్ట్ హౌస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డ నివాసానికి సమీపంలో ఉంది. అప్పట్లో అంటే బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కోసం ఈ గెస్ట్ హౌస్ లోనే వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అనుమానిస్తున్నారు. కాగా విశ్వసనీయ సమాచారం మేరకు ఈ గెస్ట్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేదని తెలుస్తోంది. త్వరలోనే ఆ ఎమ్మెల్సీని కూడా పోలీసులు విచారించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.