పెట్రోల్ మంటలకు ఇదిగో విరుగుడు..
posted on Jul 21, 2021 @ 3:27PM
పెరుగుట విరుగుట కొరకే అనే సామెత, పెట్రోల్, డీజిల్ ధరలకు మాత్రం వర్తించేలా లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు పాపంలా ప్రతి రోజు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పట్లో కాదు, ఎప్పటకీ పెరిగిన ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. కేంద్ర పెట్రోలియం, ఇంధన శాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే పెట్రోల్, డీజిల్ ధరలు సమీప భవిష్యత్తులో తగ్గే ఆవకాశం ఇప్పట్లో లేదని ఎప్పుడోనే స్పష్టం చేశారు.
ఈ నేపధ్యంలో మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ వాహనాల మధ్యతరగతి ప్రజలకు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. ఇంచు మించుగా గత నెల రోజులలో గ్రేటర్‌లో హైదరాబాద్ నగర్ పరిధిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. గత నెలరోజుల్లో సుమారు 5 వేలకు పైగా బైక్‌ల విక్రయాలు జరిగినట్లు అధికార లెక్కలు సూచిస్తున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాలకు జీవితకాల పన్నుతో పాటు వాహనం రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా ప్రభుత్వం మినహాయించింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ కింద 2 లక్షల బైక్‌లకు ఈ మినహాయింపు వర్తించనుంది. అలాగే మరో 10 వేల వరకు కార్లు, 3 వేల ఆటోలు, తదితర రవాణా వాహనాలకు కూడా ఈ మినహాయింపును ఇచ్చారు. కొద్ది రోజుల క్రితంరవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అంశాన్ని వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ద్విచక్ర వాహనాలతో పాటుగా కార్లు, ఆటోలు కూడా అమ్మకానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇంకా విక్రయాలు ప్రారంభం కాలేదు. అయితే ప్రజలు బుకింగ్‌ల పట్ల మాత్రం ఆసక్తి చూపుతున్నట్లు నగరంలోని ఓ ఎలక్ట్రిక్ వాహనషోరూమ్ నిర్వాహకులు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలపైన ప్రభుత్వం ప్రత్యేక పాలసీని అమల్లోకి తేవడానికి ముందు నుంచే నగరంలో వీటి అమ్మకాలు జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం మరింత ఆదరణ పెరిగింది.
అయితే ఇంకా విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి రాక పోవడంతో సహా కొన్ని చిన్న ప్రతిబందాకాలు ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ వాహనాలు త్వరలోనే నగర రోడ్ల పై పరుగులు తీస్తాయని అంటున్నారు.ఎలక్ట్రిక్ బైక్ ను ఒకసారి చార్జింగ్ చేస్తే 110 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చును.. నగరంలో ఇంటినుంచి కార్యాలయానికి కార్యాలయం నుంచి ఇంటికి ప్రయాణించే వారికీ ఛార్జింగ్ సమస్య కూడా ఉండదని అంటున్నారు. అయితే, ఈ వాహనాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో ... చూడవలసి వుంది.