సూపరింటెండెంట్ వేధింపులతో ఎక్సైజ్ మహిళా ఎస్ఐ ఆత్మహత్యాయత్నం..
posted on Sep 12, 2020 @ 7:13PM
గుంటూరు జిల్లా పెదకూరపాడులో ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్య యత్నం చేశారు. దీనికి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ వేదింపులే కారణమని ఆమె ఆరోపించారు. దీంతో ఉన్నతాధికారులు ఎక్సయిజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ ను సస్పెండ్ చేశారు. అయితే గత కొంత కాలంగా సూపరిటెండెంట్ బాలకృష్ణన్ పై వేధింపుల ఆరోపణలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో బాలకృష్ణన్ వ్యవహారం పై విచారణ కోసం ఉన్నతాధికారులు ఒక కమిటి ఏర్పాటు చేశారు. ఈ విచారణ కమిటీ ఎదుట హాజరైన బాధితులు గగ్గోలు పెడుతూ తమను ఆయన ఎలా వేధిస్తున్నారో చెప్పి మరీ బోరుమన్నారు. తాజాగా ఆయన వేధింపుల వల్లే మహిళా ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యాయత్నం చేశారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం ఎక్సైజ్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది.
అయితే, ఎస్ఐ గీత ఆరోపణల్లో నిజం లేదని బాలకృష్ణన్ అన్నారు. పని వత్తిడి కారణంగానే తనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. విచారణ కమిటీ ఎదుట అన్ని స్పష్టంగా చెబుతానని, విచారణలో అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.