మునుగోడు సిత్రాలు సూడరో ఓటరో ఓటరా!
posted on Oct 10, 2022 @ 3:12PM
‘సిత్రాలు చేయరో.. శివుడా.. శివుడా.. శివమెత్తి ఆడరో నరుడా.. నరుడా’ అని మనవూరి పాండవులు సినిమా పాట మాదిరిగా మారింది తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రలోభాల పర్వం. ఒక పార్టీ వారు ఓటర్లకు భారీ మొత్తంలో డబ్బుల్ని సంచుల్లో ఇస్తున్నారని, మరో పార్టీ వారు స్థానికంగా ఉండే తమ పార్టీ నేతలకు ఖరీదైన కార్లు, బైక్ లు బుక్ చేశారని, ఇంకో పార్టీ వారు విహారయాత్రకు యువకులకు ఫ్లైట్ టికెట్లు కొని ఇస్తున్నారని, ముంబై, సూరత్ లలో ఉంటున్న నియోజకవర్గంలోని ఓటర్ల కోసం విమానం టికెట్లు పంపించారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఆయా పార్టీలు తమ అభ్యర్థులకు టికెట్లు, బీఫాంలు ఇవ్వడంతో ఆగకుండా వారి గెలుపు కోసం అతిరథ మహారథులను రంగంలోకి దింపు తున్నాయి. విచ్చల విడి గా ప్రలోభాల పర్వానికి తెరలేపాయంటున్నారు.
పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసే స్థానిక నేతలు, అనుచరుల ఖర్చులకు కొన్ని డబ్బులు, ఖుషీ కోసం కాస్త మద్యం, బిర్యాని ప్యాకెట్లు ఇవ్వడం మామూలైంది. ఓటర్లకు డబ్బులివ్వడమూ ఆనవాయిగా మారిం ది. మునుగోడు ఉప ఎన్నికలో ఒక పార్టీ ఓటుకు 30 నుంచి 40 వేల దాకా డబ్బులు ఇస్తున్నారని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఒక అభ్యర్థి మునుగోడులోని తమపార్టీ లీడర్ల కోసం రెండు వందల బ్రిజా కార్లు, రెండు వేల మోటార్ బైక్ లు బుక్ చేశారని మంత్రి హరీశ్ రావు ఆరోపించడం గమనార్హం. గతంలో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు చీరలు, బంగారు, వెండి వస్తువులు ఇచ్చిన దాఖలాలున్నాయి. కానీ.. పెద్ద మొత్తంలో డబ్బులివ్వడం, కార్లు, బైక్ లు బుక్ చేయడం, ఫ్లైట్ టికెట్లు ఇవ్వడం ‘మునుగోడు ఉప ఎన్నిక చాలా రిచ్ గురూ!’ అన్నట్లు మారిందని అంటున్నారు.
మంత్రి మల్లారెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థికి ప్రచారం చేస్తున్న పార్టీ నేతలు, కార్యకర్తలకు మల్లారెడ్డి స్వయంగా మద్యం బాటిల్ ఎత్తి వారి గ్లాసుల్లో మందు పోసిన విజువల్స్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. మల్లారెడ్డి పార్టీ చేసుకున్న హొటల్ ను మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ వరకు ఆయన బుక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మునుగోడులో అద్దె ఇంటి కోసం నల్గొండ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే ఏకంగా లక్ష రూపాయల అద్దె చెల్లించారంటూ ఓ వార్త గుప్పుమంటోంది.
మునుగోడు ఉప ఎన్నిక కోసం ఓ ప్రధాన పార్టీ తెప్పించిన ఐదు లక్షల కండువాలు పోలింగ్ కు 20 రోజుల ముందే అయిపోయాయని చెబుతున్నారు. మునుగోడులో ఉన్న మొత్తం ఓటర్లు 2 లక్షల 27 వేల మంది అయితే.. ఐదు లక్షల కండువాలు అయిపోవడం విడ్డూరం కాక మరేమిటి అంటున్నారు. తమ పార్టీ కండువా కప్పుకుంటే వెయ్యి నుంచి రెండువేల రూపాయల దాకా నజరానా ఇస్తున్నట్లు సమా చారం. తమ పార్టీలో చేరే యువకునికి 10 వేలు, మరో నరుగుర్ని తీసుకొస్తే మరో 50 వేల రూపాయలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. వార్డు సభ్యులు, ఉప సర్పంచుల్లాంటి వారి చేతుల్లో 50 నుంచి 100 ఓట్లు ఉంటే 50 వేకు పైగా నగదు ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఓ ప్రధాన పార్టీ సర్పంచ్ ఆ గ్రామ ఇన్ చార్జిగా ఉన్న ఎమ్మెల్యే సమక్షంలో పార్టీ మారినందుకు 15 లక్షల ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.
ప్రధాన పార్టీలు మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి స్థానికులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాయి. టీఆర్ఎస్ అయితే.. పలువురు మంత్రులను ఇన్ చార్జులుగా నియమించింది. ఒక్కో ఎంపీటీసీ స్థానంలో ఒక్కో ఎమ్మెల్యేకి బాధ్యతలు అప్పగించింది. నియోజకవర్గంలోని ఒక్కో గ్రామానికి ఒక టీఆర్ఎస్ నేతను ఇన్ చార్జిగా పెట్టింది. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి 18 వేల కోట్ల కాంట్రాక్టు పనులు తీసుకుని బీజేపీలో చేరడం క్విడ్ ప్రొ కోకు పాల్పటమే అని ఈసీకి టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. రాజగోపాల్ రెడ్డిని అన ర్హుడిగా ప్రకటించాలని ఈసీని కోరడం గమనార్హం.
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగడంతో ఆ పార్టీకి ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. మునుగోడులో గెలుపు కాంగ్రెస్ పార్టీకి అనివార్యమే. ఇటీవలే జాతీయ పార్టీ బీఆర్ఎస్ ను ప్రకటించిన కేసీఆర్ కు కూడా మునుగోడులో విజయం తప్పనిసరే. జాతీయ పార్టీగా తొలిసారి ఎన్నిక ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ కు మునుగోడులో గెలుపు ఆవశ్యకమే. మునుగోడులో విజయం సాధించిన ఊపుతో జాతీయ రాజకీయాలు చేయాలనుకుంటున్న కేసీఆర్ కు ఇక్కడ ఓడితే పెద్ద ఎదురు దెబ్బే. ఎలాగైనా గెలిచి తీరాలని కేసీఆర్ వ్యూహాలు వేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తాను స్వయంగా ఒక గ్రామం ఇన్ చార్జిగా బాధ్యతలు తీసుకోవడం విశేషం.
మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లు ఎవరిని ముంచుతారో.. ఎవరినీ గట్టెక్కిస్తారో వారి నిర్ణయం వచ్చే దాకా వేచి ఉండాల్సిందే.