మీరు ఎక్కడంటే అక్కడికి వస్తాం.. అసెంబ్లీని ముట్టడిస్తాం.. జగన్ సర్కార్ కు పవన్ సవాల్
posted on Dec 28, 2020 @ 4:19PM
ఏపీలో కొద్ది రోజుల క్రితం వచ్చిన నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు 35 వేల రూపాయలు పరిహారం ఇవ్వకపోతే.. వచ్చే అసెంబ్లీ సమావేశాలను తమ పార్టీ అడ్డుకుంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ సర్కార్ ను హెచ్చరించారు. మీరు కనుక రైతులను ఆదుకోకపోతే అసెంబ్లీ ఎలా జరుగుతుందో చూస్తామని అయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈరోజు గుడివాడలో పర్యటన చేస్తున్న పవన్.. రైతుల సంక్షేమం కోరుకునే ఏకైక పార్టీ జనసేన అని అన్నారు. భూమి హక్కు లేక కౌలు రైతులు నష్టపోతున్నారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. "కౌలు రైతులు బాధలు పడుతుంటే వాలంటీర్లు ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏడాది మద్యం ఆదాయాన్ని వదులుకుంటే.. నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వొచ్చు. అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ జరిగినా వస్తాం. మీరు సై అంటే మేమూ సై.. అమరావతిలో పెట్టుకుంటారా, వైజాగ్‌లో పెట్టుకుంటారా, పులివెందులలో పెట్టుకుంటారా? అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ పెట్టినా అక్కడికి వచ్చి.. అసెంబ్లీని ముట్టడిస్తాం. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నాడో లేడో తెలియని జనసేనను చూసి వైసీపీ నాయకులు భయపడుతున్నారు. మాట్లాడితే చాలు సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నా అంటున్నారు. సీఎం జగన్‌కు మాత్రం ఏ వ్యాపారాలు లేవా? అయన కేవలం రాజకీయాలు చేస్తున్నారా? సీఎం సాబ్‌కు చెబుతా ఉన్నాం. పదివేల రూపాయలు విడుదల చేయండి. వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు 35వేల రూపాయలు విడుదల చేయకపోతే... రైతులు, నిరుద్యోగులు అందరూ కదలిరండి. మంచి మనిషికో మాట.. గొడ్డుకో దెబ్బ అంటారు. మేము అయ్యా, బాబు, సీఎం గారు అంటే ఏమాత్రం వినడం లేదు. రైతుల కోసం జనసేన పార్టీ ఉంది" అని పవన్ ఇటు సీఎం అటు వైసీపీ నేతలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.