బీజేపీకి పవన్ రాంరాం! తెలంగాణతో షురూ..
posted on Mar 15, 2021 @ 11:29AM
కమలానికి పవన్ కల్యాణ్ కటీఫ్ చెప్పబోతున్నారా? తన దారి తాను చూసుకోవడానికి సిద్ధమయ్యారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, పవన్ కల్యాణ్ కామెంట్లు కూడా అలానే ఉన్నాయి. తాజాగా తిరుపతి ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకోవడం, తెలంగాణ బీజేపీ నేతలపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో .. ఈ అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. బీజేపీతో పొత్తుకు జనసేన గుడ్ బై చెప్పడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.
తెలంగాణలో రాజకీయ పార్టీలు సవాల్ గా తీసుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వేళ.. బీజేపీ పై పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేంద్ర బిజెపి జనసేనతో సఖ్యతగా ఉన్నప్పటికీ తెలంగాణ బిజెపి నేతలు మాత్రం జనసేనను అవమానించారని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు హైదరాబాద్ ఎంఎల్‌సి స్థానానికి టిఆర్‌ఎస్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. జనసేనను చులకనగా చూసేలా తెలంగాణ బిజెపి నేతలు మాట్లాడారని ఆరోపించారు. కేంద్ర నాయకత్వం జనసేనతో ఉన్నా.. తెలంగాణ నాయకత్వం మాత్రం జనసేన పార్టీని చులకన చేసిందని.. అందుకే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పివి కుమార్తెకు మద్దతిస్తున్నాం అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పవన్ మద్దతు ప్రకటించడం వెనుక పెద్ద లెక్కే ఉందంటున్నారు. బీజేపీతో తెగ తెంపులు చేసుకోవాలనే యోచనలో ఉన్న పవన్ కల్యాణ్... ముందుగా తెలంగాణ నుంచి ఆ పని మొదలు పెట్టారని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను అస్త్రంగా మార్చుకుని కమలానికి ఝలక్ ఇచ్చారని తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల సమయంలో జనసేన పొత్తు గురించి బీజేపీ ఎంపీ అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలోనే జనసైనికులు తీవ్రంగా స్పందించారు. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. పవన్ తో చర్చలు జరపడంతో అప్పుడు సమస్య కొలిక్కి వచ్చింది. గ్రేటర్ లో జరిగిన పరిణామాలపై గుర్రుగా ఉన్న పవన్ కల్యాణ్.. సమయం చూసి తెలంగాణ బీజేపీని దెబ్బ కొట్టారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
తెలంగాణ బీజేపీని ఓపెన్ గానే టార్గెట్ చేసిన పవన్ కల్యాణ్.. ఏపీలో ఆ పార్టీతో కలిసి వెళ్లడం అసాధ్యమనే అభిప్రాయం అనలిస్టుల నుంచి వ్యక్తమవుతోంది. బీజేపీతో దూరం కావాలని దాదాపుగా డిసైడ్ అయ్యారు కాబట్టే.. తెలంగాణ కమలనాధులపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారంటున్నారు. తన వ్యూహంలో భాగంగానే తిరుపతి ఉప ఎన్నిక బరి నుంచి జనసేన తప్పుకుందనే చర్చ కూడా జరుగుతోంది. రాజకీయ భవిష్యత్ కోసమే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తిరుపతిలో పోటీ చేయడం వల్ల ప్రత్యేక హోదా అంశం, రైల్వే జోన్, రాజధాని, విశాఖ ప్రైవేటీకరణ తదితర అంశాలు తెరమీదకు వస్తాయని జనసేన భావిస్తుంది. ప్రత్యేక హోదా అంశం పెండింగులో ఉండగా..తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం.. కాక రేపుతోంది. కేంద్ర సర్కార్ పై నిర్ణయంపై ఆంధ్రులు భగ్గుమంటున్నారు. బీజేపీ పేరు చెబితేనే మండిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీతో దూరంగా ఉండటమే బెటరని జనసేన నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఏపీ బీజేపీ నేతల తీరుపైనా పవన్ అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. ప్రభుత్వంపై పోరాటం చేయకుండా దేవుళ్ల ఫొటోలతో ట్విట్టర్ వ్యాఖ్యలు, రీ ట్వీట్‌లు.. సామాజిక మాధ్యమాల్లో ఫార్వర్డ్‌తో సోము వీర్రాజు టీమ్ కు ఓట్లు రాలతాయా? అన్న ప్రశ్న జనసేన నేతల నుంచి వస్తుందట. ప్రతిపక్షం ఎప్పుడైనా అధికార పార్టీ తప్పులపై పోరాటం చేయాలి. సోము వీర్రాజు టీమ్ ఎక్కడా ఆ పని చేయడంలేదు. రెండోది సొంత పార్టీని బలోపేతం చేసుకోవాల్సి ఉండగా, బలమైన నాయకులు, కేడర్‌కు నేతలే అడ్డంకులు వేస్తున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్రం నుంచి భారీగా నిధులు తెచ్చి రాష్ట్రానికి ఏదైనా చేస్తున్నారా? అంటే తిరుపతి నుంచి విశాఖ వరకూ విక్రయాలే తప్ప ఊతం లేదు. అందుకే ఈ చెలిమి మనకు నష్టం కలిగించక ముందే మేలుకోవాలన్న ఒత్తిళ్లు పవన్‌కు కేడర్ నుంచి వస్తున్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో వామపక్షాలతో పోల్చిచూస్తే బీజేపీ సాధించింది తక్కువేనన్న విషయం కూడా నేతలు ప్రస్తావించినట్లు తెలిసింది.
బీజేపీపై ఉన్న వ్యతిరేకత ప్రభావం జనసేన మీద పడుతుందనే భయం కూడా పవన్ కల్యాణ్ లో కనిపిస్తుందట. అందుకే తిరుపతిలో పోటీ చేయకుండా వదిలేస్తే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చని అభిప్రాయం జనసేన నేతల్లో బలంగా ఉన్నట్లు తెలిసింది. ఫలితాలు తర్వాత ఆ పార్టీ ఒక స్టాండ్ తీసుకుని 2024 ఎన్నికలకు వెళతామని ఆ పార్టీలోని కొంత మంది చెబుతున్నారు. ఇలా అన్ని అంశాలు పరిశీలించాకే.. తిరుపతి సీటును బీజేపీకి వదిలేసి.. జనసేన సేఫ్ జోన్ లోకి వెళ్లిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత బీజేపీకి... జనసేన గుడ్ బై చెప్పే అవకాశం ఉందని అనలిస్టులు బల్లగుద్దీ మరీ చెబుతున్నారు.