పవన్ కల్యాణ్ లో అస్పష్టత.. జనసేనలో గందరగోళం!
posted on Jul 18, 2022 @ 2:23PM
యుద్ధానికి వెళ్లాలా వద్దా అనే దానిలో రాజుకి రెండు ఆలోచనలు వుండకూడదు. ప్రజా రక్షణకు కంకణం కట్టుకున్నానని ప్రగల్భాలు పలికితే సరిపోదు, రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు దిగాలి లేదా రంగంలోకి దూకేయాలి. గట్టుమీద కూచుని మరిదీ ఎటెళితే బావుంటదంటావ్ అని సంబంధంలేని వాడిని అడిగితే ఎలా? అదుగో అలా వుంది పవన్ కళ్యాణ్ వ్యవహారం. అధికార కాంక్ష బాగానే వున్నప్పటికీ, అంతే స్థాయిలో లోపల ఉన్న ఓటమి భయాన్ని బయట పడకుండా ఉత్తర కుమార ప్రగాల్బాలతో పబ్బం గడిపేసుకుందామంటే కుదరదు. ఒకసారి ఒక రకంగా మరోసారి మరో రకంగా ప్రకటనలు చేస్తే వీరాభిమానులు కూడా మరో నిర్ణయం తీసునే ప్రమాదం ఉంది. రాజకీయ రంగంలోకి కాళ్లూ చేతులూ పెట్టేసిన తర్వాత ఇంకా తెర మీదే వున్నానకుంటే ఎలా జనసేనానీ..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనం కోసమే తన రాజకీయాలు అంటూ చెబుతున్న మాటలపై ఎవరికీ అపనమ్మకం లేదు. అయితే ఆ జనం కోసం ఆయన అధికారంలోకి వచ్చి పని చేయా లనుకుం టున్నారా.. లేక ప్రశ్నించే పార్టీగా అధికారానికి దూరంగా ఉండాలనుకుంటున్నారా అన్న విషయంలోనే ఆయన ప్రసంగాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. అధికారం కాదు.. ప్రజలకు అండగా నిలవడమే ముఖ్యమంటూనే.. ఆయన కాబోయే ముఖ్యమంత్రిని తానేనంటూ ప్రకటనలు చేస్తున్నారు.
అదే సమయంలో అదే ప్రసంగంలో ఎన్నికలలో ఓడిపోయినా..ప్రజల పక్షానే నిలబడతానంటూ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకే ఆయన ఆయనపై ఆయన రాజకీయ ప్రస్థానంపై జనంలో పూర్తి విశ్వాసం కనిపించడం లేదు. 2014 ఎన్నికలలో ఎన్నికలకు దూరంగా ఉండి.. తెలుగుదేశం, బీజేపీలకు బయట నుంచి మద్దతు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ తరువాత ఏపీలో తెలుగుదేశానికి అధికారాన్ని కట్టబెట్టినది తానేనంటూ క్లెయిమ్ చేసుకోవడం ప్రారంభించారు. సహజంగానే తెలుగుదేశం పార్టీ దానికి ఖండించింది.
దాంతో ఇరు పార్టీల మధ్యా దూరం పెరిగింది. ఆ తరువాత 2019 ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీలకు దూరం జరిగి సొంతంగా జనసేన ఎన్నికల బరిలోకి దిగింది. అయితే ఆ ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాలలోనూ పరాజయం పాలయ్యారు. ఇందుకు ప్రధాన కారణం ఆయన ప్రసంగాలలో విజయం పట్ల విశ్వాసం కనిపించకపోవడమేనని అప్పట్లో పరిశీలకులు పలు విశ్లేషణలు చేశారు. ఇది జరిగి మూడేళ్లు అయ్యింది. అప్పటికీ, ఇప్పటికీ ఆయన ప్రసంగాలలో అదే అస్పష్టత, అదే సందిగ్ధం. అంతెందుకు.. ఆయన రాజకీయ అరంగేట్రం చేసినప్పటి కన్య్ఫూజన్ ఇప్పటికీ అలాగే ఉందని పరిశీలకులు అంటున్నారు.
ఆయన ప్రసంగాల్లో ఆయనలోని విశ్వాస లేమి ప్రస్ఫుటంగా ప్రతిధ్వనిస్తుంటుంది. ఒక గందరగోళం విన్నవారికి కలుగుతుంది. అసలు ఆయనలోనే స్పష్టత లేదన్నది తేటతెల్లమౌతుంది. అసలు ఆయన జనసేనకు ఓటేయమని కోరారా.. వద్దని చెప్పారా అన్న అసుమానం కలుగుతుంది. ఇటీవల ఆయన తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మండపేటలో జరిగిన రైతు భరోసా యాత్ర సభలోనూ అదే చెప్పారు. అధికారం కోసం రాలేదని విస్పష్టంగా ప్రకటిస్తూనే.. తానే సీఎం, జనసేనదే అధికారం అన్నారు. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలే ఆయన రాజకీయ నిబద్ధతపై, సీరియస్ నెస్ పై జనంలో సందేహాలకు కారణమౌతున్నాయి.
అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని అధినేత విస్పష్టంగా ప్రకటిస్తే జనం ఆయన పార్టీకి ఎందుకు ఓటేస్తారు. పైగా అభ్యర్థిని చూసి కాదు.. అధికారం అక్కర్లేదంటున్న తనను చూసి ఓటేయమని అడిగితే ఎందుకు వేస్తారు. కౌలు రైతులకు సహాయం చేయడం, పేద విద్యార్థులకు సహాయం చేయడం వంటి సామాజిక కార్యక్రమాలు సంపన్నులు చేసే ఛారటీలకు తేడా ఏముంది? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. అధికార కాంక్ష లేదంటూనే జనసేన అధికారంలోకి వస్తుందనిప్రకటిస్తారు. అధికారం కోసం రాలేదని చెప్పడం జనంలోకి ఎటువంటి ప్రతికూల సంకేతాలు పంపుతుందో.. అధికారం వస్తే ఇవి చేస్తాం అవి చేస్తాం అని అదే నోటితో ప్రకటనలు చేయడం జనసేనానికి, జనసేన పార్టీకి అంత కంటే ఎక్కువ నష్టం చేస్తుందని పరిశీలకుల భావన. అసలు ఒక రాజకీయ పార్టీ అధినేత.. గెలవకపోయినా, అధికారంలోకి రాకపోయినా ఫర్వాలేదని చెప్పాల్సిన అవసరం ఏమిటి? ఏ మూలో తనలో ఉన్న అభద్రతా భావాన్ని చాటుకోవడం తప్ప.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరుకాలేదు. భాజపాతో పొత్తు ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్.. ప్రధాని సభలో ఎందుకు పాల్గొనలేదనే దానిపై భిన్న వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో భీమవరం పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ ప్రధాని పాల్గొనే సభకు తనకు ఆహ్వానం అందిందన్నారు. అయితే స్థానిక ఎంపీకి ఆహ్వానం అందకపోవడం సరికాదన్న భావనతోనే ఆ కార్యక్రమానికి హాజరు కాలేదని చెప్పారు. ఈ మాటల ద్వారా బీజేపీతో దాదాపు తెగతెంపులు జరిగాయన్న సంకేతాలు ఇచ్చారు. ఇక ఓట్ల కోసం తాను కులాన్నే నమ్ముకుంటానన్న అర్ధం వచ్చేలా పవన్ మాట్లాడటం ద్వారా తనలోని రాజకీయ డొల్లతనాన్ని బయట పెట్టేసుకున్నారు. మరో సందర్భంలో అసందర్బంగా రాష్ట్రంలో పొత్తుపొడుపుల చర్చకు తెరతీశారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల నివ్వను అనడం ద్వారా తానే పొత్తులకు సిద్ధంగా ఉన్నానన్న సంకేతాన్ని ఇచ్చారు. ఆ వెంటనే పొత్తులకు జనసేన ఆప్షన్స్ అంటూ అసాధ్యాలను ఆప్షన్స్ గా పెట్టి ఆచరణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికకే తాను పని చేస్తున్నానని చెప్పకనే చెప్పారు. ఇన్ని పరస్పర విరుద్ధ వ్యాఖ్యలతో ఆయన జనసేన పార్టీని ఏ దిశగా తీసుకువెళుతున్నారు అన్న సందేహం పార్టీ శ్రేణుల్లోనే కలిగేలా చేస్తున్న పవన్ ఇక జనంలో కలిగిస్తున్న అయోమయానికి, ఆయనలో ఉన్న గందరగోళమే కారణమని పరిశీలకులు అంటున్నారు.