జగన్ రెడ్డి పాలనలో ఆడబిడ్డలకు రక్షణ ఉండదా! అనంతపురం ఘటనపై పవన్ ఫైర్
posted on Dec 24, 2020 @ 2:49PM
అనంతపురం జిల్లాలో దళిత యువతిని ప్రేమపేరుతో వెంటాడి, వేధించి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే యువతి హత్య జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇద్దరు యువకులు వేధిస్తున్నారని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని, వారు ముందే స్పందించి ఉంటే ఆ ఘటన జరిగేది కాదని స్థానికులు చెబుతున్నారు. దళిత యువతి హత్యపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. దిశ చట్టం చేసి ఏంటి ప్రయోజనం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రచారం కోసం చట్టాలు చేస్తే మహిళలకు రక్షణ దొరుకుతుందా? అని పవన్‌కల్యాణ్ జగన్ సర్కార్ ను నిలదీశారు.
‘దిశ చట్టం వచ్చి ఏడాది అయింది. చట్టం చేయగానే పాలాభిషేకాలు చేయించుకొని... కేకులు కోయించుకున్నారు. చట్టాన్ని మాత్రం ఆచరణలోకి తీసుకురాలేదు. ఆడ బిడ్డలపై పెట్రోలు పోసి నిప్పు పెట్టడాలు... కత్తిపోట్లు మాత్రం ఆగలేదు. ప్రచారం కోసం చేసిన ఈ చట్టం ఆడబిడ్డలకు ఏ విధంగా రక్షణ ఇస్తుందో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు, హోంశాఖ మంత్రి సుచరిత గారు ప్రజలకు సమాధానం చెప్పాలి’అని పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు.
"స్నేహలత వేధింపుల కారణంగానే చదువు మధ్యలోనే ఆపేసి చిన్న ఉద్యోగంలో చేరిందని తెలిసింది. అయితే, తమ ఇంటి ముందుకొచ్చి మరీ వేధిస్తున్నారని పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే... అక్కడ్నించి ఇల్లు మారండి అని పోలీసులు చెప్పడం వారిని మరింత కుంగదీసింది. పోలీసు వ్యవస్థ ఎంత బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందో దీన్ని బట్టే అర్థమవుతోంది. వ్యవస్థల వైఫల్యం వల్లే స్నేహలత ఇద్దరు దుర్మార్గుల చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ప్రచారం కోసం చేసిన దిశ చట్టం ఏవిధంగా ఆడబిడ్డలకు రక్షణ ఇస్తుందో సీఎం జగన్, హోంమంత్రి సుచరిత ప్రజలకు జవాబు చెప్పాలి" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
‘వ్యవస్థల వైఫల్యమే స్నేహలత ప్రాణాలు తీసింది. స్నేహలత కుటుంబానికి న్యాయం చేయాలి. మహిళల రక్షణ కోసం దిశ చట్టం చేశాం... నేరం చేసినవారికి 21 రోజుల్లో శిక్ష పడుతుంది అంటూ ప్రచారం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆచరణలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. సరి కదా మైనర్ బాలికలు, విద్యార్థినులు, యువతులు, మహిళలపై అఘాయిత్యాలు, దాడులు ఆగలేదు. ఉన్మాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం ఉండటం లేదు. విజయవాడలో రెండు ఘటనలు, గాజువాకలో ఒక ఘటనలో యువతులు మృగాళ్ల చేతుల్లో హత్యకు గురయ్యారు. ఇప్పుడు అనంతపురం జిల్లా ధర్మవరంలో స్నేహలత అనే పేద దళిత యువతి హత్యకు గురవడం అత్యంత బాధాకరం’ అని పవన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.