పొత్తుపై పవన్ క్లారిటీ.. ఇక వైసీపీకి దబిడి దిబిడే!
posted on Jan 13, 2023 @ 10:37AM
ఏపీలో తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు విషయంలో ఇంతవరకూ ఉన్న ద్వైదీ భావానికి పవన్ కల్యాణ్ తెర దించేశారు. శ్రీకాకుళం జిల్లా రణ స్థలం వేదికగా జరిగిన జనసేన యువశక్తి సభలో పవన్ కల్యాణ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎలా ముందుకు సాగాలి అన్న విషయంలో జనసేన శ్రేణులకు స్పష్టత ఇచ్చారు. ఇంత వరకూ ఇటువంటి స్పష్టత జనసేనాని ఇవ్వక పోవడంతో పార్టీలోని కిందిస్థాయి క్యాడర్ లో ఒకింత అయోమయం ఉండేది. తమ పార్టీ ఒంటరిగా ముందుకుసాగుతుందా? లేక పొత్తులు ఉంటాయా అన్నఅనుమానాలు ఉండేవి.
దీంతో క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటంలో భావసారూప్యత ఉన్న పార్టీలతో కలిసి పాల్గొనాలా, ఒంటరిగానే ముందుకు వెళ్లాలా అన్న సందిగ్ధత ఉండేది. అయితే రణస్థలం వేదికగా పవన్ కల్యాన్ అన్ని అనుమానాలకూ తెరదించేశారు. ఇష్టం ఉన్నా లేకున్నాసర్దుకు పోయి ముందుకు సాగాల్సిందేనని దిశా నిర్ధేశం చేశారు. దీంతో క్షేత్ర స్థాయిలో జన సైనికులు తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకుని ముందుకు సాగేందుకు అవకాశం ఏర్పడింది. ఒక విధంగా చెప్పాలంటే యువశక్తి సభ వేదికగా పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం మోగించేశారు.
అధికార వైసీపీ లక్ష్యంగా విమర్శల తూటాలు సంధించారు. ఒంటరి పోరుతో విరమరణం చెందాల్సిన అవసరం లేదనీ, ఉమ్మడిగా తలబడి విజయాన్ని అందుకోవడమే లక్ష్యమని కుండబద్దలు కొట్టేశారు. ప్యాకేజీ స్టార్ అంటూ అధికార పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు కూడా తనదైన శైలిలో ఘాటు సమాధానం ఇచ్చారు. వ్యక్తిగత విమర్శలకు దిగితే చెప్పులతో బడితె పూజ ఖాయమని హెచ్చరించారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శించిన ఏ ఒక్కరినీ వదల కుండా అందరికీ ఘాటుగా బదులిచ్చారు. ఇక పొత్తు నిర్ణయం తీసుకోవడానికి కారణాన్ని కూడా ఆయన నిర్మొహమాటంగా చెప్పేశారు. తన సభలకు ఇసుక వేస్తే రాలనంత మంది జనం వస్తారు కానీ ఆ స్థాయిలో ఓట్లు మాత్రం రావడం లేదని పేర్కొన్నారు. తనకు అధికారం మీద కాదు జనం మీదే మమకారం అని చెప్పిన ఆయన ప్రజలకు మేలు చేయాలన్నదే తన లక్ష్యమనీ, అందుకే రాజకీయాలలోకి వచ్చానని చెప్పారు. రెండు ముక్కలైన రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడానికి కుట్రలు చేస్తున్నారని దీన్ని ప్రతి జనసైనికుడు ఎదిరించాలని పిలుపునిచ్చారు. జగన్ ను మూడు ముక్కల ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. తాను పొత్తుకు సుముఖంగా ఉండటానికి కారణం కూడా ఆయన ఈ సభలో విస్పష్టంగా చెప్పారు. పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తే గెలుపు గ్యారంటీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు.
అందరూ తన సభలకు వస్తారు జేజేలు కొడతారు తప్ప ఎన్నికలకు వచ్చి ఓట్లు వేయరని అలాంటప్పుడు తనని గెలిపిస్తానని గ్యారెంటీ ఇస్తే మరెవరితోనూ పొత్తు పెట్టుకొను అని ఆయన అన్నారు. ఆ పరిస్థితి లేదు కనుకనే మన గౌరవానికి భంగం కలగకుండా ఉంటే ఇతర పార్టీలతో కలిసి నడుద్దామని నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. పవన్ కల్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో రాష్టంలో రాజకీయ వేడి పుంజుకోవడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. విశాఖలో పవన్ కల్యాణ్ కు జగన్ సర్కార్ అవరోధాలు కల్పించిన సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేనానినిక సంఘీ భావం తెలిపిన సందర్భంలోనూ, కుప్పం పర్యటనలో చంద్రబాబుకు జగన్ సర్కార్ అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన సందర్బంగా పవన్ కల్యాణ్ చంద్రబాబుకు సంఘీభావం తెలపడం తో ఇరు పార్టీల మధ్య పొత్తు ఉంటుందన్న అంచానాలైతే వచ్చేశాయి.
ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై చర్చలు కూడా ఒక కొలిక్కి వచ్చేశాయన్న ప్రచారమూ జరిగింది. అయితే ఇప్పటి వరకూ ఆ ప్రచారాన్ని ఇరు పార్టీలూ ధృవీకరించకలేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చేయడంతో క్షేత్రస్థాయిలో ఇరు పార్టీలూ సమన్వయంతో పని చేసే అవకాశాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలన్న వైసీపీ వ్యూహాలకూ పవన్ తన విస్పష్ట ప్రకటనతో చెక్ పెట్టినట్లే అయ్యింది. దీంతో జగన్ పాలనను జన క్షేత్రంలో ఎండగట్టడమే లక్ష్యంగా ఇంత కాలం తెలుగుదేశం, జనసేనలు వేర్వేరుగా ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకు వెళ్లాయి. ఇప్పుడు ఇక ఉమ్మడి ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకు కదులుతాయి. ఏపీలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయమైపోయింది.