విజయవాడ ఎంపీ టిక్కెట్ : పవన్ కళ్యాణ్ మనస్తాపం?
posted on Apr 14, 2014 @ 2:51PM
విజయవాడ తెలుగుదేశం ఎంపీ టిక్కెట్ వ్యవహారం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ని మనస్తాపానికి గురిచేసినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ పెట్టడానికి, బహిరంగ సభలు నిర్వహించడానికి వెన్నుదన్నుగా నిలిచిన పొట్లూరి ప్రసాద్‌కి విజయవాడ ఎంపీ తెలుగుదేశం టిక్కెట్ ఇప్పించడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నించాడు. చంద్రబాబు నాయుడు కూడా దీనికి సానుకూలంగా స్పందించాడు. అప్పటి వరకూ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వున్న కేశినేని నానిని పక్కన పెట్టి పొట్లూరి ప్రసాద్‌కి టిక్కెట్ ఇవ్వడానికి అంగీకరించారు. అయితే చంద్రబాబు నిర్ణయం కేశినేని నానితోపాటు స్థానిక తెలుగుదేశం కార్యకర్తలకు రుచించలేదు. చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకోలేదని బహిరంగంగానే విమర్శించడం ప్రారంభించారు. కేశినేని నాని కూడా నిరసన గళాన్ని వినిపించడం, రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తాననే ‘సౌండ్’ ఇవ్వడంతో సదరు సీటు కేశినేని నానికే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే ఈ ఇష్యూలో విజయవాడ తెలుగుదేశం కార్యకర్తలు పవన్ కళ్యాణ్‌ని ఘాటుగా విమర్శించారు. మధ్యలో దూరిపోయి కేశినేని నానికి అన్యాయం చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. టోటల్‌గా ఈ ఇష్యూలో పవన్ కళ్యాణే ముద్దాయిలా నిలిచాడు. దీంతో పవన్ కళ్యాణ్ మనస్తాపానికి గురైనట్టు తెలిసింది. పొట్లూరి ప్రసాద్‌కి టిక్కెట్ ఇస్తున్నట్టు ప్రకటించడానికి ముందే స్థానిక తెలుగుదేశం క్యాడర్‌ని ఒప్పించి ఉంటే ఇంత రాద్ధాంతం జరిగి వుండేది కాదని పవన్ కళ్యాణ్ తన సన్నిహితుల దగ్గర వాపోయినట్టు తెలుస్తోంది.