మోడీ ప్రకటన చేస్తారని ఎవరన్నా చెప్పారా? విపక్షాలపై ప్రత్తిపాటి ఫైర్
posted on Oct 23, 2015 @ 5:03PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. విపక్షాలు చేస్తున్న నిరసనలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన రోజు మోడీ ప్రత్యేక హోదా గురించి కానీ.. ప్రత్యేక ప్యాకేజీ గురించి కాని ప్రకటిస్తారని ఎవరైనా చెప్పారా? చెప్పలేదు కదా.. ఇప్పుడు ఎందుకు మోడీ ప్రత్యేక హోదా గురించి ప్రకటించలేదని అనవసరమైన ఆందోళనలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో విపక్షాలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయని.. కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిచ్చు పెట్టడానికే చూస్తున్నారని మండిపడ్డారు. విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ మోడీ నెరవేరుస్తామని చెప్పారు.. అసలు అప్పుడు విభజన చట్టంలో ప్రత్యేక హోదాను ఎందుకు పొందుపరచలేదని కాంగ్రెస్ పార్టీని.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను ప్రత్తిపాటి నిలదీశారు. అంతేకాదు తగలబెట్టాల్సింది మోడీ దిష్టిబొమ్మలు కాదు.. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి దిష్టిబొమ్మలను అని విమర్శించారు. జగన్ కు ముఖం చెల్లక శంకుస్థాపన కార్యక్రమానికి రాలేదని అన్నారు.