పఠాన్ కోట్ ఉగ్రదాడి.. పాకిస్థాన్ లో దర్యాప్తు ముమ్మరం..
posted on Jan 12, 2016 @ 11:51AM
పంజాబ్ లోని పఠాన్‌కోట్ విమాన స్థావరంపై ఉగ్రదాడి కేసులో నిందితుడిగా ఉన్న గురుదాస్ పూర్ ఎస్పీ సల్పీందర్ సింగ్ ను ఎన్ఐఏ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను సోమవారం దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించగా సల్వీందర్ సింగ్ మాత్రం విరుద్ధ సమాధానాలు చెప్పడంతో లైడిటెక్టర్ పరీక్షలకు పంపిచాలని ఎన్ఐఏ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈవిచారణలో భాగంగానే సల్వీందర్ సింగ్ వద్ద వంట మనిషిగా ఉన్న మదన్ గోపాల్‌కూ ఎన్ఐఎ సమన్లు జారీ చేసింది. విచారణ నిమిత్తం ఈ నెల 13న హాజరు కావాలని చెప్పింది.
ఇదిలా ఉండగా మరోవైపు ఈ దాడిపై విచారణ చేపట్టేందుకు గాను పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఐబీ, ఐఎస్ఐ, ఎంఐ, ఎఫ్ఐఏ, స్థానిక పోలీసులతో కలిపి సంయుక్త దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే దర్యాప్తు బృందం మూడు జిల్లాల్లో ముమ్మర సోదాలు చేసి పదుల సంఖ్యలో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ దర్యాప్తుకు సంబంధించిన నివేదికను కూడా భారత్ కు అందజేశారంట. అయితే ఉగ్రవాదులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు భారత్ తెలిపినా తమ దేశంలో రిజిష్టర్ కాలేదని ఆ నివేదికలో పాక్ వెల్లడించినట్లుగా తెలుస్తోంది.