ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ రేసులో పతంజలి
posted on Aug 10, 2020 @ 6:14PM
ఐపీఎల్-2020 టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి చైనాకు చెందిన మొబైల్ కంపెనీ వివో తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెజాన్, బైజూస్, డ్రీమ్ 11 వంటి కంపెనీలు ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ కోసం పోటీ పడుతున్నాయి. యోగా గురువు బాబా రాందేవ్‌కు చెందిన దేశీయ ఆయుర్వేద ఔషధ సంస్థ 'పతంజలి' కూడా ఈ స్పాన్సర్‌షిప్ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పతంజలి ప్రతినిధి ఎస్‌కే తిజరావాలా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ చేసేందుకు పతంజలి సిధ్ధంగా ఉందని, తమ బ్రాండ్ కు అంతర్జాతీయ గుర్తింపు కోసం తాము ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆగస్టు 14 లోగా తన ప్రతిపాదనను సమర్పించాల్సి ఉందని చెప్పారు.
కాగా, సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు యూఏఈలో ఐపీఎల్ టోర్నీ జరగనుంది. ఇందుకు గాను ఫ్రాంచైజీలు, ప్లేయర్లు ఇప్పటికే సిద్ధమవుతున్నారు.