మొదటి రోజే రాజ్యసభలో రచ్చ
posted on Jul 21, 2015 @ 3:23PM
అనుకున్నట్టుగానే పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. ప్రారంభమయిన మొదటిరోజే పార్లమెంట్ లో ఆందోళనలు తలెత్తాయి. ముందునుండే విపక్షాలు వ్యతిరేక ధోరణితో ఉన్న కారణంగా పలు అంశాలపై వారు వివాదాలు లేవనెత్తారు. ముఖ్యంగా లలిత్ మోదీ వీసా వ్యవహారం. ఈ వ్యవహారం రాజ్యసభలో పెద్ద దుమారాన్నే రేపింది. ఈ వీసా వ్యవహారంపై లలిత్ మోదీని ఎన్డీఏ ప్రభుత్వం వెనుకేసుకోస్తుందని.. లలిత్ మోదీ విదేశాలకు వెళ్లడానికి సుష్మా స్వరాజ్, వసుంధర రాజే సహకరించినా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. లలిత్ మోదీపై ఎఫ్ఐఆర్ దాఖలైందని.. రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారని.. అయినా ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదో కారణాలు చెప్పాలని ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టేందుకు ప్రయత్నించారు. మొత్తానికి ప్రారంభమయిన మొదటిరోజే ఇంత రచ్చ రచ్చగా ఉన్నాయంటే ఇంకా జరగబోయే రోజుల్లో ఎన్ని వివాదాలు తలెత్తుతాయో.