BJP to target Rahul for racist marks...

 

Rahul Gandhi might have strongly criticised the government to let black money be changed into white, on the floor of parliament. “They launched a Fair and Lovely yojana to convert black money into white money. Modiji had promised that he would put people with black money behind bars, now they have come up with ways to save those people.” His comparison of the government’s initiative with the Fair and Lovely is drawing huge remarks from the opposition. They claim that such comparison reflects the mindset of Rahul Gandhi, that being dark is to be ugly. The ruling party is proposing to bring up a discussion to ban the advertisements such a Fair and Lovely, which hints that being a girl with dark complexion is a curse. But the real intention is to target the comments of Rahul Gandhi.

అసెంబ్లీలో సుహృద్భావ వాతావరణం.. కేటీఆర్ తీరు పంటి కింద రాయి తీరు!

చట్ట సభలు అంటే ఒకప్పుడు ప్రజాస్వామ్య దేవాలయాలుగా భాసిల్లేవి. అసెంబ్లీ, లోక్ సభలో జరిగే చర్చలు బాధ్యతాయుతంగా, అర్ధవంతంగా సాగేవి. సభలో సభ్యుల మధ్య అంశాలవారీగానే విభేదాలు తలెత్తేవి తప్ప.. ఎన్నడూ వ్యక్తిగత స్థాయికి దిగజారేవి కాదు. అయితే రాను రాను ఆ పరిస్థితి మారిపోయింది. సభ వేదికగా వ్యక్తిగత విమర్శలు, దూషణలు అన్నవి సర్వసాధారణమన్నట్లుగా మారిపోయాయి. సభలో ప్రజా సమస్యలపై చర్చ అన్నదే మృగ్యమైపోయిన పరిస్థితి ఏర్పడింది.  తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన  మార్పు కానవచ్చింది.  సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.  ఆ వాతావరణం తాజాగా సోమవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలోనూ ప్రస్ఫుటంగా కనిపించింది. నిప్పుల తూటాలలాంటి విమర్శలతో ఇటీవల ఒకరిపై ఒకరు విరుచుకుపడిన రేవంత్, కేసీఆర్ లు సభలో పరస్పరం పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. సీఎం రేవంత్ ఆప్యాయంగా, కలుపుగోరు తనంగా మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణ అసెంబ్లీలో ఎన్నడూ కనబడని అరుదైన దృశ్యంగా ఇది చాలా కాలం యాదుండి పోతుందనడంలో సందేహం లేదు. ఈ సుహృద్భావ పూరిత వాతావరణం ఏర్పడటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకున్నారు. అసెంబ్లీలోకి అడుగుపెడుతూనే రేవంత్ రెడ్డి ముందుగా ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్థానం వద్దకు వెళ్లారు. ఆయనను మర్యాదగా పలకరించి, ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఆ తరువాత ఆప్యాయంగా షేక్ హ్యాండిచ్చి మరీ తన స్థానానికి వెళ్లారు. పలువురు మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనుసరించి కేసీఆర్ ను పలుకరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇది అసెంబ్లీలో సభా మర్యాదలు ఎలా ఉండాలన్నదానికి అద్దంపట్టింది. అ యితే ఇంత జరిగినా పంటి కింద రాయిలా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు వ్యవహరించారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి స్వయంగా విపక్షాల వద్దకు వచ్చిన సమయంలో  కేసీఆర్ సహా అక్కడ అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడినా కేటీఆర్, కౌషిక్ రెడ్డిలు మాత్రం  తన స్థానం నుంచి లేవకుండా మౌనంగా కూర్చుండిపోవడం సభలో వాతావరణం సమూలంగా మారలేదనడానికి తార్కానంగా నిలిచింది. రేవంత్ చూపిన స్ఫూర్తికి విఘాతంగా కేటీఆర్ తీరు ఉందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.  

జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయిన పనులేంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ పరాజయానికి ప్రధాన కారణం తన హయాంలో జరిగిన మేలు ప్రజలకు చెప్పుకోవడంలో విఫలం కావడమేనని తరచూ చెబుతుంటారు. తన ఓటమికి కారణం ఆ చెప్పుకోలేకపోవడమేనని నమ్ముతుంటారు.  ఇంతకీ ఆయన హయాంలో చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటి?  అంత చేసీ ఎందుకు చెప్పుకోలేకపోయారు అన్న విషయంపై సామాజిక మాధ్యమంలో ఓ స్థాయిలో డిబేట్ జరుగుతోంది. వాస్తవానికి ఆయన అరకొరగా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలకు అంతకు వందింతల ప్రచారం చేసుకున్నారు.   జ‌గ‌న్ చేసిన సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌చారానికి ప్రత్యేకంగా ఒక నెట్ వర్కే  ఉండేది.  ఏపీడీసీ వంటి  సంస్థ‌లు కూడా ఆ నెట్ వర్కక లో ఉండేది. ఏపీసీసీని జగన్ ఆంధ్రప్రదేశ్  డిజిట‌ల్ కార్పొరేష‌న్ (ఏపీడీసీ)గా పేరు మార్చి దానికి భారీ ఎత్తున బడ్జెట్ కేటాయించారు.   ఒక నిమిషానికి రెండున్న‌ర వేలు ఇవ్వాల్సింది కాస్తా  ప‌ది ప‌న్నెండు వేలుగా ఇచ్చి.. మ‌రీ వీడియోల రూప‌క‌ల్ప‌న చేశారు. ఇదిలా ఉంటే సంక్షేమ ప‌థ‌కాల బ‌ట‌న్ నొక్కుడు కార్య‌క్ర‌మాల‌కు సిద్దం  సభ‌ల‌క‌న్నా మించిన స‌భ‌లు ఏర్పాటు చేసి... వాటి ద్వారా జ‌నాన్ని పోగేసి సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కూడా జగన్ హయాంలో ప్రభుత్వ సంక్షేమాన్ని గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ప్రచారం నిర్వహించారు.   ఇందుకు ఒక ఎమ్మెల్సీ తన సిబ్బందితో ఈ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షించ‌గా.. వాటిని నాటి మంత్రి పెద్ది రెడ్డి సూప‌ర్వైజ్ చేసేవారు. ఇందుకు రూ.కోట్లు ఖర్చు చేసేవారు. ఇక్కడ చెప్పుకోవల సిందేమిటంటే..  ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు. వారి శోధనలో జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటంటే..  ఎలుక‌లు ప‌ట్ట‌డానికి  కేటాయించిన రూ. 1. 6 కోట్లు, తాడేప‌ల్లి ప్యాలెస్ చుట్టూ కంచె కోసం ఖర్చు చేసిన రూ. 12. 5 కోట్లు, ఎగ్ ప‌ఫ్ ల కోసం రూ. 3. 6 కోట్లు, పాస్ పుస్త‌కాల‌పై తన ఫోటోల కోసం రూ. 13 కోట్లు,  వైయ‌స్ విగ్ర‌హాల ఖ‌ర్చు రూ. 18 కోట్లు, స్కూళ్లు, ఇతర ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసుకోవడానికి ఖర్చు చేసిన రూ.150 కోట్లు.  తన పర్యటనల కోసం విమానాలు, హెలికాప్టర్ల కోసం ఖర్చు చేసిన  రూ. 222 కోట్లు. వీటి గురించే జగన్ చెప్పుకోలేకపోయారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంతేనా  రుషికొండ ప్యాలెస్ కి రూ. 600 కోట్లు, బియ్యం సంచులు మోయ‌డానికి  రూ. 700 కోట్లు, స‌రిహ‌ద్దు రాళ్ల‌పై ఫోటోల‌కు ఇంకో రూ. 700 కోట్లు కూడా జగన్ ప్రభుత్వ ధనాన్ని వెచ్చించారు. ఆ ఖర్చుల గురించి కూడా జగన్ జనాలకు చెప్పుకోలేకపోయారట. ఆ కారణంగానే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందన్నది జగన్ భావన అని నెటిజనులు తేల్చారు. అవి చెప్పుకోలేకపోవడం వల్లనే కనీసం 11 స్థానాలైనా వచ్చాయనీ, వాటి గురించి కూడా ఘనంగా చెప్పుకుని ఉంటే, అవి కూడా వచ్చేవి కావని సామాజిక మాధ్యమంలో జగన్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. 

కేసీఆర్ కు రేవంత్ షేక్ హ్యాండ్

నిప్పూ ఉప్పులా పరస్పర విమర్శలు గుప్పించుకునే కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఆసెంబ్లీలో ఆప్యాయంగా పలకరించుకున్న సన్నివేశం అందరినీ అలరించింది. సర్వత్రా ఆసక్తి కలిగించింది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ క్షేమ సమాచారాలు అడిగారు. ఆ తరువాత కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సంఘటన అధికార ప్రతిపక్ష సభ్యులను విస్మయానికి గురి చేసింది. సభా మర్యాదలంటే అలా ఉండాలన్న చర్చ అధికార ప్రతిపక్షాలలో జరిగింది.   అదలా ఉంటే.. రేవంత్ కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన తరువాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తదితరులు కూడా కేసీఆర్ ను పలుకరించి ఆయనతో కరచాలనం చేశారు.  ఇక ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ కు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.  ‎

ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలేంటంటే?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో జరుగుతున్న ఈ కేబినెట్  భేటీలో రాష్ట్ర అభివృద్ధి,  పాలనాపరమైన కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.  ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా   కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే  కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.  అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో.. రూ.103.96 కోట్ల వ్యయంతో రెండెకరాల విస్తీర్ణంలో అత్యాధునిక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ చర్చించి ఆమోదముద్ర వేయనుంది.  అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణలో పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టడంపై సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.  ఇకపోతే..  రాజధాని అమరావతి అభివృద్ధి పనుల వేగవంతంపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో  సంక్షేమ పథకాల అమలు తీరుపై కూడా సమీక్ష జరిగే అవకాశం ఉంది.   ఇంకా వర్షాకాలంలో రాజధాని పరిసర ప్రాంతాలను వరద ముంపు నుంచి కాపాడేలా ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే  అఖిల భారత సేవా అధికారుల నివాస భవనాలకు అదనపు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు  109 కోట్ల రూపాయల కేటాయింపునకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.   అమరావతి పరిధిలోని శాఖమూరు లో 23 ఎకరాలలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల  నిర్మాణానికీ, అలాగే తాళ్లూరులో  6 ఎకరాలో  హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా కేబినెట్ పచ్చ జెండా ఊపే అవకాశం ఉంది. ఎల్పీఎస్ జోన్-8 పరిధిలో లేఅవుట్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం  నిధుల కేటాయింపుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక రాజధాని పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకూ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.  

సినిమాలకు తమిళ హీరో విజయ్ గుడ్ బై.. రాజకీయాలకే పూర్తి సమయం

రాజకీయ నాయకుడిగా మారిన తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఆయన తమిళ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ సభలో తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా మరణించిన సంఘటనతో ఆయన తొలి అడుగులు ఒకింత తడబడ్డాయి.  దాని నుంచి తేరుకుని ముందుకు సాగడానికి ఒకింత సమయం తీసుకున్న విజయ్ ఇప్పుడ పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగానే  సినిమాల‌కు గుడ్ బై చెప్పారు విజ‌య్.  ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం. వచ్చే ఏడాది త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ ఎన్నికలకు విజయ్ సర్వసన్నద్ధం అవుతున్నారు.  ఏ పార్టీలతోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే ఎన్నికల సమరంలోకి అడుగుపెట్టనున్నట్లు  ఆయన ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే రాజకీయవర్గాలలో విజయ్  టీవీకే పార్టీకి ఉన్న విజయావకాశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే సీఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో టీవీకే విజయం కంటే ఎన్డీయే కూటమికి భారీ నష్టం కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తేలింది.  టీవీకే పోటీ వల్ల బీజేపీ, అన్నాడీఎంకే  కూటమి ఓట్లు భారీగా చీలుతాయని పేర్కొంది. అంటే విజయ్ పార్టీ పోటీ వల్ల లాభపడేది అధికార డీఎంకే అన్నది సీఓటర్ సర్వే సారాశంం.   ఇక సైద్ధాంతికంగా బీజేపీతో, రాజ‌కీయంగా డీఎంకేతోనే త‌మ  పోటీ అని విజయ్ ప్రకటించిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. విజయ్ స్వయంగా మధురై ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.  విజయ్ ది చెన్నై. అయితే ఆయ‌న మ‌ధురైని త‌న సొంత  నియోజ‌క‌వ‌ర్గం చేసుకోవాల‌ని భావిస్తున్నారు. స్టార్ హీరో కావడంతో విజయ్ కు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సామాన్య జనంలోనూ మంచి పాపులారిటీ ఉంది. దీంతో మధురైలో ఆయన స్థానికేతరుడు అన్న సమస్య తలెత్తే అవకాశం ఉండదన్నది పరిశీలకులు అంచనా.    ఇక పోతే విజ‌య్ పార్టీకి సంబంధించినంత వరకూ ఆ పార్టీలో విజయ్ వినా పెద్దగా  ఫెమిలియ‌ర్ ఫేస్ మరొకటి లేదు. ఒక వేళ విజ‌య్ పార్టీలోకి రావడానికి డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ వంటి  పార్టీలు ఆసక్తి చూపుతున్నా.. వారికి రెడ్ కార్పెట్ పరిచి పార్టీలోని ఆహ్వానించడానికి విజయ్ పెద్దగా సుముఖత చూపడం లేదు.  ఆయ‌న వారిని ఏమంత‌గా  తీసుకోవ‌డం లేదు.  ఏపీ నుంచి న‌గ‌రి మాజీ ఎమ్మెల్యే రోజా సైతం త‌న భ‌ర్త ఇన్ ఫ్లూయెన్స్ వాడి విజ‌య్ ఏర్పాటు చేసిన టీవీకేలో చేరాల‌ని ప్రయత్నించినా, ఆమెకు అక్కడ నుంచి పెద్దగా సానుకూలత వ్యక్తం కాలేదని అంటున్నారు. దీంతో పార్టీలో పెద్దగా పాపులర్ అండ్ ఫేమస్ నేతలు లేకపోవడం విజయ్ టీవీకే పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.   ఒక తమిళ రాజకీయాలలో ప్రస్తుత పరిస్థితిని ఒక సారి గమనిస్తే.. రాష్ట్రంలో  బీజేపీకి ఉన్న పట్టు అంతంత మాత్రమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పొత్తులో భాగంగా ఒకటి రెండు స్థానాలు దక్కితే అదే చాలనుకునే పరిస్థితిలో  బీజేపీ ఉంది.  దీంతో ప్రధాన పోటీ  డీఎంకే- టీవీకే మ‌ధ్యే ఉంటుందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.    ఇక విజ‌య్ టీవీకే పార్టీ నుంచి అత్యధికంగా ఆయన అభిమాన సంఘాల నాయకులకే టికెట్ లు లభించే అవకాశం కనిపిస్తోంది. అంటే టీవీకే తరఫున పోటీ చేసే అభ్యర్థులలో అత్యథికులు ఆ పార్టీ నేత విజయ్ తో కలిసి రాజకీయాలకు కొత్తవారే అవుతారు. ఇది పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. మొత్తం మీద  డీఎంకే,  టీవీకే మ‌ధ్య  ముఖాముఖీ అన్నట్లుగా జరగనున్న   త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉందనడంలో సందేహం లేదు.  

అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్.. హీట్ మామూలుగా ఉండదుగా?

తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్.. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత ప్రతిపక్ష నాయకుడి పాత్రకు పరిమి తమయ్యారు. అయితే ఆ పాత్రలో ఆయన ఎంత మాత్రం క్రియాశీలంగా లేరు. ఓటమి తరువాత ఆయన పూర్తిగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీకి కూడా హాజరు కాకుండా రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన  ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.   అయితే పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత, ఆయన అనివార్యంగా రాజకీయాలలో క్రీయాశీలం కావలసిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికీ, పార్టీని బలోపేతం చేయడానికి కేసీఆర్ స్వయంగా నడుంబిగించకుంటే లాభం లేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో కూడా బలోపేతం అవుతోంది. దీంతో తన పొలిటికల్ అజ్ణాత వాసానికి ఫుల్ స్టాప్ పెట్టి జనంలోకి రావడానికి సిద్ధమైపోయారు. తాజాగా ఇటీవల ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిపిన సమావేశంలో ఇక నుంచీ తాను పొలిటికల్ గా క్రియాశీలమౌతాననీ,  అదే సమయంలో అసెంబ్లీలో పార్టీ తరఫున బలమైన గొంతు వినిపించాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పారు. ఈ మాటలే ఆయన ఈ సారి అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరు అవుతారని తేటతెల్లం చేసింది. అయినా ఎక్కడో ఏదో అనుమానం.  గతంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో కూడా ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనీ, అధికార పక్షాన్ని తన ప్రశ్నల పరంపరతో ఉక్కిరిబిక్కిర చేస్తారనీ బీఆర్ఎస్ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలను సభ సాక్షిగా ఎండగడతారనీ బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా నమ్మాయి. అయితే  అయితే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. గొంతు విప్పలేదు. ఫామ్ హౌస్ గడప దాటలేదు. మరి ఇప్పుడైనా అసెంబ్లీకి వస్తారా? అన్న అనుమానాలు పరిశీలకుల నుంచే కాదు, పార్టీ శ్రేణులనుంచి కూడా వ్యక్తం అయ్యాయి. అయితే ఆ అనుమానాలన్నిటినీ పటాపంచలు చేస్తూ కేసీఆర్ ఈ సారి అసెంబ్లీ హాజరౌతున్నారు. సోమవారం (డిసెంబర్ 29) ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు.  ఇక ఇప్పుడు ఆయన అసెంబ్లీలో గొంతు విప్పి రేవంత్ సర్కార్ ను ఇరుకున పెడతారా? స్పీకర్ ఆయనకు కోరినంత సమయం మైక్ ఇస్తారా? లేకుంటే? అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్  తలపడితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరు పై చేయి సాధిస్తారు అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. మొత్తం మీద కేసీఆర్ హాజరుతో ఈ శీతాకాల సమావేశాలు రోహిణీ కార్తెను మించిన హీట్ తో సాగుతాయనడంలో ఎలాంటి సందేహాలు లేవంటున్నారు. 

కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామ్ తో చంద్రబాబు భేటీ.. ఎక్కడంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు ఆమెతో భేటీ అయ్యారు. ఇరువురి మధ్యా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ  అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.   రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి   సహకారం, బడ్జెట్ లో ప్రాధాన్యత వంటి అంశాలను చంద్రబాబు ఆమెతో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం చంద్రబాబు కృష్ణా జిల్లా  పెద్దఅవుటపల్లిలోని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు నివాసానికి వెళ్లారు ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కంభంపాటి తల్లి వెంకటనరసమ్మ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కంభంపాటి రామ్మోహనరావు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.   వెంకటనరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

దేశం శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధికి కారణం ఇందిరా, రాజీవ్‌లే : టీపీసీసీ చీఫ్

  శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా గాంధీ, పటేల్ చిత్రపటాలకు పూలమాల సమర్పించి టీపీసీసీ చీఫ్ నివాళులు అర్పించారు. ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని ప్రగతి పథంలో నడిపింది పీవీ నరసింహారావు అని గుర్తు చేశారు. పేద ప్రజలకు ఉపయోగపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని తీసుకొస్తే మోదీ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.  మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ మహారథి జాతి నిర్మాణ సారథి. ప్రజాస్వామ్య ఆకాంక్షల వారధి. పేదల ఆకలి తీర్చిన పెన్నిధి. 140 కోట్ల భారతీయుల ప్రతినిధి. 141 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం.  కార్యకర్తల చెమట చుక్కలే సిరా చుక్కలై రాసిన చరిత్ర కాంగ్రెస్. కార్యకర్తలకు, నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు.

ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు కాంగ్రెస్ నిరసనలు

  జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు (28న) గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ శ్రేణులు మహాత్మాగాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టాయని ఆయన తెలిపారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మహాత్మా ఉపాధి హామీ పథక అమలు బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం పక్కకు తప్పుకోవాలని చూస్తోందని, పేదలు, గ్రామీణ కూలీలకు భరోసాగా ఉన్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. దీనికి నిరసనగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 28న రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద, గాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసనలు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, పనికి ఇచ్చే గౌరవాన్ని ప్రజలకు వివరంగా తెలియజేయాలని సూచించారు.రేపు జరగబోయే నిరసన కార్యక్రమాలను పెద్దఎత్తున విజయవంతం చేయడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.

రేపో మాపో రేవంత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?

తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందా? రేపో మాపో రేవంత్ కెబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారా? అన్న చర్చ తెలంగాణ రాజకీయాలలో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం రేవంత్ హస్తిన పర్యటకు బయలుదేరనున్నారు. శనివారం (డిసెంబర్ 28) హస్తినలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ పెద్దలతో భేటీ అవుతారు. ఈ భేటీ ప్రధాన అజెండా మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణే అంటున్నారు. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు. ఇక బీసీ కోటాలో ఆది శ్రీనివాస్, ఎస్టీ కోటాలో బాలూ నాయక్ లూ రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ కేవలం కేబినెట్ విస్తరణ కాకుండా పునర్వ్యవస్థీకరణకు అనుమతి ఇవ్వాలని హైకమాండ్ ను కోరనున్నారు. ఇందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మార్పులు, చేర్పులతో కేబినెట్ ను పున్వ్యవస్థీకరించి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.