తిరుపతి అభ్యర్థిగా పనబాక నామినేషన్
posted on Mar 24, 2021 @ 3:12PM
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు నామినేషన్లు మొదలు కావడంతో రాజకీయ వేడి పెరిగింది. ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. తిరుపతి లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి నెల్లూరులో నామినేషన్ వేశారు. నెల్లూరు వీఆర్సీ కూడలి నుంచి తెలుగు దేశం పార్టీ నేతలు , కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కీలక నేతలు యనమల, సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు.. పనబాక లక్ష్మికి మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో వైసీపీ విఫలమైందని ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనలో విఫలమైన వైసీపీ ఎంపీలకు పదవుల్లో కొనసాగేందుకు అర్హత లేదని మండిపడ్డారు. ఢిల్లీలో బలంగా గళం వినిపించేందుకు పనబాక లక్ష్మిని గెలిపించాలని టీడీపీ నేతలు కోరారు.
వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు చనిపోవడంతో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరుగుతోంది. ఉప ఎన్నికలో తమ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని ప్రకటించింది అధికార పార్టీ. సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత ఫిజియోతెరపిస్టుగా ఉన్నారు గురుమూర్తి. బీజేపీ ఇంకా అభ్యర్థని ఖరారు చేయలేదు. కర్ణాటక ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ బీజేపీ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ మరోసారి పోటీ చేయబోతున్నారు. ఏపీ పీసీసీ నుంచి ఏఐసీసీకి ఆయన ఒక్క పేరే వెళ్లింది. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలంటూ ఇప్పటికే ఆయన ప్రచారం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు సంధిస్తున్నారు.
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఈ నెల 30వ తేదీ. 31న పరిశీలన, ఏప్రిల్ 3వ తేదీ వరకూ ఉపసంహరణకు గడువు ఉంది. ఏప్రిల్ 17న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు విడుదల కానున్నాయి.