ఉస్మానియాలో మళ్ళీ ఉద్రిక్తతలు
posted on Apr 13, 2013 @ 7:48PM
తెలంగాణ ఉద్యమాలకు ప్రాణం పోసే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజకీయ చైతన్యం కూడా చాలా ఎక్కువే. కొద్దిరోజుల క్రితం విశ్వవిద్యాలయం హాస్టల్ గోడలపై ‘తెలంగాణ కోసం సాయుధ పోరాటానికి సిద్ధం కండి’ అంటూ కొన్ని వాల్ పోస్టర్స్ వెలియడంతో విద్యార్దులతో సహా పోలీసులు కూడా ఉలికిపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, సాయి అలియాస్ చిన్నఅనే విద్యార్ధిని ప్రశ్నించడానికి తమతో తీసుకువెళ్ళడంతో విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాయి హైదరబాద్ నల్లకుంట ప్రాంతంలో అనుష్క డిజైనర్స్ అనే ప్రింటింగ్ ప్రెస్ నడిపిస్తూన్నాడని సమాచారం. విశ్వవిద్యాలయంలో జరిగే తెలంగాణ ఉద్యమాలకి అతనే అవసరమయిన బ్యానర్లు, పోస్టర్లు డిజైన్ చేసి ప్రింటింగ్ చేస్తాడని తెలియడంతో పోలీసులు అతనిని ప్రశ్నించడానికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. అదేవిధంగా తెలంగాణ విద్యార్ధి సంఘంలో చురుకుగా పాల్గోనే మరో విద్యార్ధి కోటా శ్రీనివాస్ ను కూడా పోలీసులు తమతో తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా అతను తప్పించుకొని పారిపోయాడని ఓయు.జెయేసి అధికార ప్రతినిధి యం..క్రిశాంక్ తెలిపాడు. విద్యార్దులందరూ కూడా తెలంగాణ కోరుకొంటున్నపటికీ, ఎవరూ కూడా అటువంటి తీవ్రఆలోచనలు చేయరని, బహుశః వామ పక్షాలకు చెందిన కార్యకర్తలలెవరో ఆ పోస్టర్స్ పెట్టి ఉండవచ్చునని అతను అభిప్రాయ పడ్డాడు.