ఆస్కార్ కొట్టిన ‘నాటు నాటు’ పాట
posted on Mar 13, 2023 @ 11:19AM
అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ సత్తా చాటింది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కింది. దీంతో ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి భారతీయ గీతంగా ఈ పాట చరిత్ర సృష్టించింది. ఆర్ఆర్ఆర్ సంగీత దర్శకుడు కీరవాణి, నాటు నాటు పాట రచయత చంద్రబోస్ ఆస్కార్ వేదికపైస ఈ అవార్డు అందుకున్నారు.
అయితే పురస్కారం ప్రకటించడానికి ముందే ఆస్కార్ వేదికపై.. నాటు నాటు పాటకు హాలీవుడ్ డ్యాన్సర్లు డ్యాన్స్ చేశారు. సినిమాలో ఈ పాట పాడిన గాయకులు రాహుల్ సిప్లింగంజ్, కాలభైరవ లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. వారి పాటకీ, బీట్ కి ఆస్కార్ ఆడియన్స్ స్టాండిగ్ ఒవేషన్ ఇచ్చారు. అస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకకు ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి, నటులు రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ హాజరయ్యారు. కాగా తెలుగు సినిమా పాటకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కడం పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ హర్షం వ్యక్తం చేశారు.
అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, మెగా స్టార్ చిరంజీవి..ఇలా ఒకరని కాదు రాజకీయ సినీ ప్రముఖులెందరో ఆర్ఆర్ఆర్ బృందానికి అభినందనలు తెలిపారు. ఇక ఆస్కార్ పురస్కారం పొందిన నాటు నాటు పాట కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ప్రాంతం, భాష, దేశం ఇలాంటి వాటి వేటితోనూ సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లభించింది.
వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ ఉర్రూతలూగించింది. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరిచేతా స్టెప్పులేయించింది. ఇప్పుడు ఆస్కార్ పురస్కారాన్ని సాధించుకు వచ్చింది. ఇక బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఇండియాకు మరో ఆస్కార్ పురస్కారం కూడా దక్కింది. 'ది ఎలిఫెంట్ విష్పర్స్' ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఒకే ఏడాది ఇండియాకి రెండు ఆస్కార్స్ రావడం గర్వించదగ్గ విషయం.