విపక్షాల ఐక్యతా యత్నాలు..ప్రధాని కుర్చీ కోసం కోట్టాటలు!
posted on Apr 25, 2023 @ 4:43PM
జాతీయ రాజకీయాల్లో మార్పుతీసుకుని వచ్చి..వెూడీకి వ్యతిరేకంగా గంట కట్టాలని తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రయత్నాలకు ఎవరూ కలిసి రాలేదు. వెూడీని గద్దె దించాలంటే బీజేపీయేతర రాజకీయ పార్టీల్లో ఐక్యత అవసరం. అయితే ఆ ఐక్య కూటమికి నాయకత్వం విషయంలో మాత్రం ఏ పార్టీకి ఆ పార్టీయే నేనే ముందు అంటుండటంతో అడుగులు ముందుకు పడటం లేదు. విపక్షాలలోనిఈ బలహీనతే బలంగా బీజేపీకి బలంగా మారుతోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీన పడడంతో జాతీయ రాజకీయాలలో ఆధిపత్యం కోసం పోటీపడే పార్టీల సంఖ్య పెరిగిపోయింది. పోటీపడటమే కానీ.. సయోధ్య యత్నాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఏ పార్టీకి ఆ పార్టీ ఎదుటి పార్టీని అడుగు వేయనీయకుండా అడ్డుపడుతోంది.
ఇప్పుడు తాజాగా బీహార్ సిఎం నితీశ్ కుమార్ ఐక్యత యత్నాలను కొనసాగించేందుకు రంగంలోకి దిగారు. అయితే గతంలో ఈ ప్రయత్నం చేసిన కెసిఆర్‌తో నితీశ్ ముందుగా చర్చించి ఉంటే ఈ నితీష్ ప్రయత్నాలకు ఎంతో కొంత విశ్వసనీయత దక్కేది. కానీ విపక్షాల ఐక్యతా యత్నాలను ఎవరు ప్రారంభించినా ప్రధాని కుర్చీని దృష్టిలో ఉంచుకునే అడుగు ముందుకు వేస్తున్నారు. ఆ కారణంగానే ఆ కుర్చీకి తమతో పోటీకి వస్తారనుకున్న వారిని పక్కన పెట్టి ఆ ప్రయత్నాలకు శ్రీకారం చుడుతున్నారు. గతంలో కేసీఆర్ ప్రయత్నాలు విఫలం కావడానికీ, ఇప్పుడు తాజాగా నితీష్ ఐక్యత అంటూ రాష్ట్రాలు చుట్టేయడానికీ కూడా ఇదే కారణం. దీంతో విపక్షాల ఐక్యత గత మూడేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. ఐక్యతా యత్నాలే తప్ప ఐక్యత వాస్తవ రూపం దాల్చడం లేదు. ఇక కేంద్రంలో పదేళ్ల పాటు యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ కూడా విపక్షాల ఐక్య కూటమికి నాయకత్వం వహించడాన్ని బాధ్యతగా కాకుండా ఒక హక్కుగా భావించడం వల్ల కూడా ఐక్యతా యత్నాలు ముందుకు సాగడం లేదు. తాజాగా నితీష్ కుమార్ , తేజస్వీ యాదవ్ కలసికట్టుగా ప్రారంభించిన ఐక్యతా యాత్ర కూడా తొలి అడుగులోనే తడబడిందనే చెప్పాలి.
ఎందుకంటే ఆయన తొట్ట తొలిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఆ తరువాత ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను కలిశారు. వీరిరువురూ కూడా కొద్ది కాలం కిందటే... బీజేపీయేతర, కాంగ్రెస్సేతర పార్టీల ఐక్యతే తమ లక్ష్యం అని బాహాటంగా ప్రకటించారు. అటువంటప్పుడు కాంగ్రెస్ తో మహాఘట్ బంధన్ లో ఉన్న నితీష్, తేజస్విలు వారిని కలిసి ఐక్యతారాగం వినిపించడం వృధా ప్రయాసే తప్ప మరొకటి కాదని పరిశీలకులు అంటున్నారు. మొత్తంగా ప్రధాని వెూడీ పాలనపై ప్రజా వ్యతిరేకత ఎంత ఉన్నా.. ప్రత్యామ్నాయం కనిపించని పరిస్థితి ఉండటంతో జనం ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇదే మోడీకి శ్రీరామరక్షగా మారుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
2024 సార్వత్రిక ఎ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలి, మోడీని గద్దె దించాలి అన్నదే బీజేపీయేతర పార్టీల లక్ష్యం. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ నుంచి మొదలు ఇప్పుడిప్పుడే జాతీయ రాజకీయాలలో తొలి అడుగు వేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు, బీజేపీ ప్రత్యర్ధి పార్టీల నాయకులందరిదీ అదే మాట. అదే లక్ష్యం. ఆ లక్ష్యంతోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్ర చేశారు. అందుకోసమే కమ్యూనిస్టులు ముందు వెనుకలు చూసుకోకుండా పొత్తులకు రెడీ అయిపోతున్నారు. కమ్యూనిస్టులా వారెక్కడున్నారు అన్న కేసీఆర్ పంచన చేరడానికి కూడా వారు ఒక్క క్షణం వెనుకాడని పరిస్థితి ఉంది. ఇక మరాఠా యోధుడు శరద్ పవార్, బెంగాల్ బెబ్బులి మమతా బెనర్జీ, ఆప్ అరవింద్ కేజ్రివాల్ ఎవరి శక్తి మేరకు వారు వారి వారి దారిలో నడుస్తున్నారు.
శరద్ పవార్ అయితే మహా ముఖ్యమంత్రిగా తన మేనల్లుడిని కూర్చోపెట్టేందుకు పొత్తు యత్నాలకు మోకాలడ్డడానికి కూడా వెనుకాడటం లేదు. బీజీపే వ్యతిరేక పార్టీల నేతలు అందరికీ తానే తలలోని నాలుక అంటూ హడావుడి చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు అదే లక్ష్యంతో సొంత కుంపటి పెట్టుకుని బీహార్ లో ఒంటరిగా పాద యాత్ర కు పరిమితమైపోయారు. ఆయన ఎక్కడ నడుస్తున్నారో, ఆయనకు జనం మద్దతు ఉందో లేదో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో విపక్షాల ఐక్యతా యత్నాలు ఫలిస్తాయా? 2024 సార్వత్రిక ఎన్నికలలో ఏకతాటిపై నడిచి విజయం సాధిస్తాయా అంటే ఔననే సమాధానం మాత్రం రావడం లేదు.