జనంలో టీడీపి..భయంలో వైసీపీ
posted on May 20, 2023 @ 12:12PM
ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అధికా ప్రతిపక్షాలు వచ్చే ఎన్నికల కోసం అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే వాటి ఎన్నికల సన్నాహకాలలోనే ఏ పార్టీ ఎక్కడ ఉందన్నది తేటతెల్లమౌతోంది. తెలుగుదేశం జనంలో ఉంటే.. వైసీపీ నాలుగు గోడలకే పరిమితమైంది.
అధికారం కోసం ప్రజా క్షేత్రంలో జరిగే ఎన్నికల సమయంలో తెలుగుదేశం ప్రజలతో మమేకమై దూసుకుపోతుంటే.. వైసీపీ నాలుగు గోడల మధ్యే పరిమితమై.. నోటికి పరిచెప్పడంతో పరిపెట్టుకుంటోంది. అదే సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ.. ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి వెళ్లిపోయింది. జగన్ నాలుగేళ్ల పాలనలో అధికార వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు, ఇదే ఖర్మ మన రాష్ట్రానికి తదితర కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి చాలా బలంగా తీసుకు వెళ్లారు.
రాష్ట్ర వ్యాప్తంగా సూడిగాలి పర్యటనలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర చేస్తూ ననిత్యం ప్రజల మధ్యే ఉంటూ.. జగన్ అధికార పీఠం ఎక్కిన నాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో అడుగంటిన అభివృద్ధి, సంక్షేమం గురించి సోదాహరణంగా వివరిస్తూ ముందుకు దూసుకెళ్తన్నారు. అలాగే ఆ పార్టీ శ్రేణులు సైతం పార్టీ అధినేత, అగ్రనేత అడుగు జాడల్లో నడుస్తున్నారు.
అయితే అందుకు భిన్నంగా అధికార పార్టీ మాత్రం ప్రజలకు ముఖం చాటేస్తోంది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ కానీ.. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ.. జనంలోకి వెళ్లే ధైర్యం చేయలేకపోతున్నారు. తాను కాకుండా ఎమ్మెల్యేలను మంత్రులను జనంలోకి పంపేందుకు జగన్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతలకు అడుగడుగునా ప్రజా నిరసన ఎదురైంది. దీంతో వారు జనంలోకి వెళ్లడానికి జంకుతున్నారు. దీంతో జగన్ తనకు మరో సారి పదవీ యాగం కోసం జనం సొమ్ముతో యాగాలు చేసుకుంటూ అధికారం కోసం జపం చేస్తున్నారు.
ఇక పార్టీలో పెల్లుబుకుతున్న అసమ్మతి, అసంతృప్తి, అంతర్గత కుమ్ములాటలను నిలువరించేందుకు కూడా జగన్ ఇసుమంతైనా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. వివేకా హత్య కేసు పరిణామాలు జగన్ కు వరుసకు సోదరుడు, కడప ఎంపీ అయిన అవినాష్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే.. మొదట్లో ఆయనను కాపాడడానికి హస్తిన కేగి మరీ ప్రయత్నాలు చేసిన జగన్ ఇప్పుడు ఆ మరక తనకు అంటకుండా ఉంటే చాలన్నట్లుగా వ్యవహరిస్తూ మౌనం పాటిస్తూ తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారు.
పార్టీ క్యాడర్, నాయకులు, ఎమ్మెల్యేలూ, మంత్రులూ అందరినీ పక్కన పెట్టి కాపాడండి మహప్రభో అంటూ వాలంటీర్లను వేడుకుని వాళ్లే గట్టెక్కిస్తారన్న ఆశతో, గట్టెక్కిస్తారా అన్న ఆందోళనతో కాలం గడుపుతున్నారు. మొత్తంగా ఏపీ లో ఎన్నికల సంవత్సరంలో వైసీపీ వైఫల్యాలపైనే జనంలో ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఆ చర్చను సజీవంగా ఉంచడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా సఫలీకృతం అవుతోంది.