కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ విస్తరణకు దోహదం?!
posted on Mar 11, 2023 @ 11:11AM
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ సమన్ల మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. విచారణ షురూ అయ్యింది. విచారణ అనంతరం కవితను అరెస్టు చేసే అవకాశాలున్నయన్న ప్రచారమూ జోరుగా సాగుతోంది. నిన్న మొన్నటి వరకూ కవితకు పెద్దగా మద్దతు ప్రకటించని బీఆర్ఎస్ అధినేత, తండ్రి కేసీఆర్, మంత్రి సోదరుడు కూడా అయిన కేటీఆర్, సమీప బంధువు హరీష్ రావు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఇప్పుడు ఆమెకు సంఘీభావంగా హస్తిన చేరుకున్నారు.
బీఆర్ఎస్ నినాదమైన బైబై మోడీ ఫ్లెక్సీలు ఢిల్లీలో కవితకు మద్దతుగా వెలిశాయి. ఒక్క సారిగా బీఆర్ఎస్ రాజకీయం మొత్తం ఢిల్లీపై కాన్సన్ ట్రేట్ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కవితను అరెస్టు చేసే అవకాశాలున్నాయని చెప్పేశారు. చేసుకోనివ్వడం చూద్దాం అంటూ చాలెంజ్ కూడా చేశారు. అలా బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ముగిసిందో లేదో ఇలా మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు హస్తిన ఫ్లైట్ ఎక్కేశారు. ఈ మధ్యలోనే ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ విచారణలో తాను ఎమ్మెల్సీ కవితకు బినామీని అని అంగీకరించిన హైదరాబాద్ కు చెందిన వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై యూటర్న్ తీసుకున్నారు.
అంతే కాదు తాను ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతించాలంటూ కోర్టును శుక్రవారం (మార్చి 10) ఆశ్రయించారు. ఆయన పిటిషన్ పై కోర్టు ఈడీకి నోటీసులు ఇచ్చింది. వాస్తవానికి కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడానికి అరుణ్ రామచంద్రపిళ్లై వాంగ్మూలమే ఆధారమని చెప్పవచ్చు. అటువంటిది అరుణ్ రామచంద్రపిళ్లై తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకుంటానంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కవితకు ఏదో మేరకు ఊరట లభించినట్లేనని అంటున్నారు. ఆమెను అరెస్టు చేసే అవకాశాలు పెద్దగా లేవన్న ప్రచారం కూడా సాగుతోంది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు హైదరాబాద్ నుంచి హుటాహుటిన హస్తినకు వెళ్లినది కూడా ఈడీ విచారణ ఎదుర్కొని బయటకు వచ్చే కవితకు ఘనస్వాగతం పలికి తోడ్కొని రావడానికేనని కూడా అంటున్నారు.
అయితే ఒక సారి ఇచ్చిన వాంగ్మూలం ఉపసంహరించుకోవటం సాధ్యం అవుతుందా.. చట్టంలో అటువంటి వెసులు బాటు ఉందా, అలాగే వాగ్మూలం ఉపసంహరించుకోవటానికి కోర్టు అనుమతి ఇస్తుందా? అన్న ప్రశ్నలపైనే ఇప్పుడు చర్చ అంతా సాగుతోంది. మొత్తానికి అరుణ్ రామచంద్రపిళ్లై వాంగ్మూలం ఉపసంహరించుకోవడానికి దాఖలు చేసిన పిటిషన్ అలా ఉంటే.. కవిత మాత్రం ఈడీ విచారణకు హాజరయ్యారు. అమె అరెస్టవుతారా లేదా అన్న ఉత్కంఠకు మరి కొన్ని గంటలలో తెరపడుతుంది.
అయితే కవితకు ఈడీ నోటీసులు, విచారణ నేపథ్యంలో జాతీయ రాజకీయాలలో ఒక్కసారిగా కుదుపు వచ్చిన మాట వాస్తవం. ఆమె హస్తిన వేదికగా శుక్రవారం (మార్చి 10) చేపట్టిన మహిళా రిజర్వేషన్ల బిల్లు దీక్షకు దాదాపు 18 రాజకీయ పార్టీలు మద్దతు, సంఘీభావం ప్రకటించాయి. ఈ దీక్ష వేదికగా ఆమె కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలలో మరింత చురుకుగా వ్యవహరించేందుకు ఈ పరిణామాలు కచ్చితంగా దోహదం చేస్తాయనడంలో సందేహం లేదు.