కాంగ్రెస్ కథ మళ్ళీ మొదటికి..
posted on Aug 22, 2022 @ 1:48PM
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, అధ్యక్ష పీఠంపై ఎవరు? మూడేళ్లుగా ఇదే ప్రశ్న అప్పుడప్పుడు వినిపిస్తూనే వుంది. అయినా, సమాధానం మాత్రం చిక్కడం లేదు. ఇదిగో అదిగో అంటూనే ఏదో ఒక వంకన పార్టీ సంస్థాగత ఎన్నికలు ఒకటికి రెండు సార్లు వాయిదా పడ్డాయి. అనివార్య పరిస్థితులలో తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సోనియా గాంధీ మూడేళ్ళుగా ఆపదవిలో కొనసాగుతూ కొత్త రికార్డు సృష్టించారు. నిజానికి, దేశంలోనే కాదు ప్రపంచంలో ఇంకెక్కడా కూడా, మూడేళ్ళకి పైగా పార్టీ అధ్యక్ష పీఠం ఖాళీగా పెట్టిన పార్టీ కాంగ్రెస్ తప్ప బహుశా మరొకటి ఉండక పోవచ్చును.
రాహుల్ గాంధీ సారధ్యంలో 2019లో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరసగా రెండవసారి, ఘనంగా ఓడి పోయింది. కాంగ్రెస్, బలం కనీసం మూడంకెల సంఖ్యకు అయినా చేరుతుందని ఆశించినా, హస్తం పార్టీ సంఖ్యా బలం అర్థ శతకం దగ్గరే ఆగిపోయింది. చివరకు పార్టీ అధ్యక్ష హోదాలో పోటీచేసిన రాహుల్ గాంధీ, సొంత నియోజకవర్గం అమేథిలో ఓటమిపాలయ్యారు. ఈ నేపధ్యంలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అంతే కాదు, నెహ్రూ గాంధీ కుటుంబం బయటి వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ)కి సూచించారు.అయినాసీడబ్ల్యుసీ కాదంది. రాహుల్ గాంధీనే పార్టీ అధ్యక్షునిగా కొనసాగాలని, సీడబ్ల్యుసీ సభ్యులు పట్టుపట్టారు. అయినా రాహుల్ గాంధీ ససేమిరా అన్నారు. మరోమారు బాధ్యతలు తీసుకునేది లేదని, ఖరాఖండిగా తెగేసి చెప్పారు.
ఆ పరిస్థితుల్లో అటు రాహుల్ మెట్టు దిగక, ఇటు ఇంకెవరూ ముందుకు రాకపోవడంతో, చివరకు 22 ఏళ్లుగా పార్టీ బాధ్యతలను తన భుజస్కందాలపై మోసిన సోనియా, తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలను మరో మారు తమ భుజస్కందాలపైకి ఎత్తుకున్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడు ఓకే అంటే అప్పుడు ఆ బాధ్యతను ఆయనకు అప్పగించి తాను తప్పుకుందామని చూస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా సొనియాగాంధీతో పాటుగా పార్టీ కూడా రాహుల్ గాంధీ ఎప్పుడెప్పుడు ఊ... అంటారా అని ఎదురుచూస్తూనే ఉన్నారు. అందుకోసం అధ్యక్ష ఎన్నికలను ఒకటికి రెంసుసార్లు వాయిదా కూడా వేశారు.
చివరకు, ఆయన ఊ .. అన్నట్లే అని, ఎన్నిక ముహూర్తం ఖరారైన తర్వాత ఉహు .. అనేసి నట్లు సమాచారం. దీంతో, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక కథ మళ్ళీ మొదటి కొచ్చిందని అంటున్నారు.
నిజానికి, ఈ నెల (ఆగష్టు) 21వ తేదీ నుంచి వచ్చే నెల (సెప్టెంబర్) 20వ తేదీ మధ్యలో, పార్టీ అధ్యక్ష ఎన్నికతో సహా పార్టీ సంస్థా గత ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) త్వరలో సమావేశం అవుతుందని ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే రాహుల్ గాంధీ, అధ్యక్ష పదవి వద్దే వద్దని మళ్ళీ మొరాయించడంతో ... కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు మరోమారు వాయిదాపడే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి.
అయితే, ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 20 లోగా, ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని, కాంగ్రెస్ పార్టీ కేంద్ర సంస్థాగత ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ తెలిపారు. ఇప్పటికే షెడ్యూలు ఖారారు చేసి. సీడబ్ల్యుసీ ఆమోదం కోసం పంపామని చెప్పారు. సీడబ్ల్యుసీ ఆమోదం తెలిపిన వెంటనే ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. మరో వంక, సోనియా గాంధీ వయసు, ఆరోగ్య దృష్టా ఇంకా పదవిలో కొనసాగే అవకాశం లేదని, అందుకు ఆమె ఏ మాత్రం సుమఖంగా లేరని, సో .. రాహుల్ గాంధీ కూడా కాదంటే, ప్రియాంక వాద్రాకు పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వీహెచ్ హనుమంతరావు వంటి, గాంధీనెహ్రు కుటుంబ బంట్లు, ఇప్పటికే రాహుల్ కాదంటే ప్రియాంకకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే, ఈ సంవత్సరం ఆరంభంలో జరిగిన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ప్రియాంక సారధ్యం వహించినా ఫలితం లేక పోయిందని అంటున్నారు. అంతకు ముందు 17 స్థానాలున్న కాంగ్రెస్ పార్టీ, మొన్నటి ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకు పడిపోయిందని కొందరు గుర్తు చేస్తున్నారు. ప్రియాంక సంవత్సరం పైగా యూపీలోనే ఉండి కష్టపడినా, కనీస పాటి ప్రభావం చూపలేని ఆమెకు పార్టీ జాతీయ అధ్యక్ష పదవి అప్పగిస్తే, అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితి ఏమిటని కొందరు అంటున్నారు. మరో వంక ఆమె భర్త రాబర్ట్ వాద్రా అనేక అవినీతి ఆరోపణలు, విచారణలు ఎదుర్కుంటున్న నేపధ్యంలో ప్రియాంకకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం వలన కొత్త చిక్కులు ఎదురవుతాయని కొందరు సందేహం వ్యక్త పరుస్తున్నారు.
అంతే కాకుండా, కుటుంబ వెలుపలి వారికి పార్టీ పగ్గాలు అప్పగించాలని రాహుల్ గాంధీ పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో, అశోక్ గెహ్లాట్, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, కుమారి శైలజ, ముకుల్ వాస్నిక్ సహా మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, బయటి వ్యక్తికీ పార్టీ పగ్గాలు అప్పగించడం సోనియా గాంధీకి సుతరామూ ఇష్టం లేదని, చివరకు ప్రియాంకకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు అంత సుముఖంగా లేరని అంటున్నారు.
అయితే, కాదు.. కూడదు అంటే రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభించనున్న 'భారత్ జోడో యాత్ర'ను సాకుగా చూపి, ఐదు నెలల పాటు సాగే యాత్ర ముగిసే వరకు ఎన్నికలు వాయిదా వేసినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. నిజానికి, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకంటే, పార్టీ అధ్యక్ష ఎన్నికలే కాంగ్రెస్ పార్టీకి క్లిష్టంగా మారినట్లుందని పరిశీలకులు భావిస్తున్నారు. అంతే కాకుండా, రాహుల్ గాంధీ సూచించినట్లు కుటుంబం వెలుపలి వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే దీర్ఘ కాలంలో పార్టీకి మేలు జరుగుతుందని కూడా పరిశీలకులు అంటున్నారు.