చితి పేర్చుకుని సజీవ దహనమయ్యాడు!
posted on May 5, 2023 @ 3:10PM
భరించరాని బాధను మనుసులో పెట్టుకున్న ఓ పెద్దాయన తీసుకున్న నిర్ణయం అందరినీ కలిచివేసింది. తన పోషణ కుమారులకు భారం కాకూడదని ఆ పెద్దమనిషి నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
90ఏళ్ల వృద్ధుడు తన చితిని తానే పేర్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ మండలం పోట్లపల్లికి చెందిన వెంకటయ్యకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తనకున్న నాలుగు ఎకరాల పొలంతోనే బిడ్డలను పెంచి పెద్ద చేసి వారికంటూ ఒక జీవితాన్ని అందించాడు. వయసు విూద పడటంతో వెంకటయ్య తనకున్న నాలుగు ఎకరాల పొలాన్ని నలుగురు కుమారులకు పంచి ఇచ్చాడు. పొలాన్ని పంచుకున్న ఆ అన్నదమ్ములు తండ్రిని కూడా పంచుకోవాలని భావించారు.
తండ్రిని వంతుల వారీగా చూసుకోవాలని కుమారులు నిర్ణయించారు. ఇదే విషయాన్ని తండ్రికి చెప్పారు. అయితే కుమారులు తీసుకున్న నిర్ణయం నచ్చని వెంకటయ్య ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. తనని వంతులు వారీగా చూసుకుంటానన్న కుమారుల నిర్ణయంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. చివరకు ప్రాణాలు వదలడానికి సిద్ధమయ్యాడు.
దీంతో తన చితిని తానే పేర్చుకున్న వెంకటయ్య ఆత్మాహుతికి పాల్పడ్డాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. వెంకటయ్య ఆత్మాహుతి చేసుకున్నాడని తెలిసి గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నవెూదు చేసి దర్యాప్తు చేపట్టారు.