ఒడిశా సీఎం.. ‘నవీన’ రాజకీయం!
posted on May 18, 2023 @ 2:16PM
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రాజకీయ చాణక్యుడు అన్న పదానికి సరిగ్గా అతికినట్లు సరిపోతారు.
ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ! అన్నట్లు.. వివాదాలకు దూరంగా ఉంటారు. రాష్ట్రంలో అత్యధిక కాగం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఆయన విజయ రహస్యం ఆయన వ్యవహార శైలే. రాష్ట్రంలో బీజేపీతో కయ్యం, జాతీయ స్థాయిలో నెయ్యం ఆయన తీరు. అదే ఆయనను ఇతర బీజేపీయేతర ముఖ్యమంత్రులలా కేంద్రం నుంచి చిక్కులు ఎదుర్కొనే అవకాశం లేకుండా తప్పిస్తోందన్నది పరిశీలకుల విశ్లేషణ. తన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలతో ఏ మాత్రం రాజీపడకుండా ఆయన నెరపే రాజకీయ సంబంధాలు పరిశీలకులను సైతం అచ్చెరువునకు గురి చేస్తాయనడం అతిశయోక్తి కాదు.
ఒడిశా జర్సుగూడ ఉప ఎన్నికల్లో బీజేపీపై తమ పార్టీ అభ్యర్థి విజయం సాధించిన గంటల వ్యవధిలో ఆయన బీజేపీపై నిప్పులు చెరిగారు. కమలం పార్టీ డబుల్ ఇంజన్ తో ప్రజలకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. ప్రజారంజక పాలనే అన్నిటికంటే ముఖ్యమన్నారు. ఈ మాటలు మాట్లాడడానికి కొద్ది రోజుల ముందే ఆయన హస్తినలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అక్కడ ఆయన బీజేపీ వ్యతిరేక కూటమిలో తాను భాగస్వామిని అయ్యే ప్రశక్తే లేదన్న విస్పష్ట ప్రకటన చేశారు. దీంతో ఆయన బీజేపీకి సన్నిహితం అవుతున్నారన్న ఊహాగానాలు కూడా చెలరేగాయి. అంత కంటే ముందు నవీన్ పట్నాయక్ తో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, పశ్చిమ బెంగాల్‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేర్వేరుగా కలిశారు ఈ రెండు సందర్భాలలోనూ ఆయన తమ భేటీకీ రాజకీయాలకూ సంబంధం లేదనే అన్నారు. వాస్తవానికి నితీష్, మమత ఇరువురూ కూడా 2024 ఎన్నికల్లో బీజేపీపై ఉమ్మడి పోరాటానికి నవీన్‌ను ఆహ్వానించడానికే వచ్చారు. అది బహిరంగ రహస్యం.
అయినా వారితో తన భేటీలలో రాజకీయాలు లేవని నవీన్ ప్రకటించేశారు. ఇలా ప్రతి సందర్భంలోనూ తామరాకు మీద నీటిబొట్టులా వ్యవహరించే నవీన్ పట్నాయక్ స్వరాష్ట్రమైన ఒడిశా ప్రయోజనాలు, ప్రగతి విషయంలో మాత్రం రాజీపడరు. అందుకే దేశంలో సుదీర్ఘ కాలం సీఎంగా పని చేసిన ముఖ్యమంత్రులలో ముందు వరుసలో నిలిచారు.