ఊబకాయం తగ్గాలంటే!

 

ఇప్పుడు ఎవరిని కదిపినా, ఊబకాయమే తమ ప్రధాన సమస్య అంటున్నారు. మారుతున్న జీవనశైలిలో కలిసి సాగినందుకు ప్రతిఫలంగా ఇప్పుడందరికీ ఊబకాయమే దక్కుతోంది. బరువెక్కిపోతున్న ఒంటితో మనిషి రూపం ఎలాగూ మారిపోతుంది. దీంతో రోజువారీ వెంటాడే సమస్యలు మొదలుకొని దీర్ఘకాలికంగా దెబ్బతీసే అనారోగ్యాల వరకూ ఏర్పడే దుష్ప్రభావాలు తక్కువేమీ కాదు. కానీ కాస్త జాగ్రత్తగా ఉంటే ఊబకాయం నుంచి దూరం కావడం అంత తక్కువేమీ కాదేమో.. మీరే చూడండి!

 

సమస్యని గుర్తించడం:  ఊబకాయం ఏర్పడటానికి ఒకొక్కరికీ ఒకో కారణం ఉంటుంది. కొంతమంది అధికంగా చక్కెర పదార్థాలు తినడం వల్ల (కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌) ఊబకాయం వస్తుంది. మరి కొందరికి మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల వస్తుంది. ఇంకొందరికి కదలకుండా కూర్చోవడం వల్లో, తరచూ మద్యపానం చేయడం వల్లో వస్తుంది. అందుకని ముందుగా సమస్యని గుర్తించడం... దాన్ని ఎలా ఎదుర్కోవడం అన్నదాని మీద కసరత్తు జరగాలి.

 

ఆహారంలో మార్పులు:  ఆహారం అంటే ఔషధం అని ఆయుర్వేదం చెబుతోంది. మన శరీర తత్వానికీ, పరిస్థితికీ అనుగుణంగానే ఆహారాన్ని నిర్ణయించుకోవాలన్నది శతాబ్దాలుగా వినిపిస్తున్న మాట. కొన్ని ఆహారాలు చక్కెర అధికంగా ఉంది శక్తిని అందిస్తాయి. కొన్ని కావల్సిన పోషకాలని ఇస్తాయి. మరి కొన్నింటి వల్ల నష్టమే తప్ప ప్రయోజనం ఉండదు. అందుకని ఊబకాయాన్ని తగ్గించుకోవాలనుకున్న శ్రద్ధ ఉన్నప్పుడు అవసరానికి మించి శక్తిని అందించే బంగాళదుంప వంటి కూరలనీ బేకరీ పదార్థాలనీ విడనాడాలి. మనకి అవసరమయ్యే శక్తిని అందిస్తూనే, ఒంట్లోని కొవ్వుని కరిగించే ఓట్స్‌ వంటి పదార్థాలకి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి.

 

శిక్షకుల అవసరం:  ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు ఏ యోగాసనాలో, వ్యాయామాలో చేసేయాలని ఉబలాటపడటం సహజం. కానీ నిపుణుడైన పర్యవేక్షకుని సలహా ఉన్నప్పుడే... ఒక క్రమశిక్షణ ప్రకారం, నియమానుసారంగా శ్రమించడం మంచిది. పైకి సాధారణంగా కనిపించే కపాలభాతి వంటి వ్యాయామాలు కూడా పర్యవేక్షకుని సలహా లేకపోతే ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదం లేకపోలేదు. మన శరీర తత్వాన్ని, అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని సదరు నిపుణులు ఎలాంటి వ్యాయామం చేయాలి? ఎప్పుడు చేయాలి? వాటిని పాటించేటప్పుడు ఏర్పడే ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలి? వంటి సూచనలు సలహాలు ఇస్తారు.

 

చిట్కాలతో పోయేదేముంది:  కొన్నికొన్నిసార్లు చిట్కావైద్యం అద్భుతాలు చేయవచ్చు. వేడి నీటిలో తేనెని కలుపుకుని తాడగం, రాగిచెంబులో ఉంచిన నీరు తాగడం, వెల్లుల్లిని తీసుకోవడం, గ్రీన్‌ టీ తాగడం... వంటి చిట్కాల మీద ఓ రాయి వేసి చూడవచ్చు. అయితే ఒకోసారి చిట్కా వైద్యం కూడా వికటించే ప్రమాదం ఉంది కాబట్టి... అజీర్ణం, నిద్రలేమి, వాంతులు వంటి దుష్ప్రభావాలు కనిపిస్తే ఈ చిట్కాలను ఆపేయడం మంచిది. ఇక నిపుణుల సలహా లేకుండా భస్మాలూ, పొడులూ వంటివాటి జోలికి పోకపోవడం ఉత్తమం.

 

సహనమే శ్రీరామరక్ష!:  ఏదో ఒక రోజున అద్దంలో ఊబకాయం ఉన్న విషయం మనల్ని బాధపెడుతుంది. వెంటనే దానిని తగ్గించుకునేందుకు హడావుడి పడిపోతాం. కానీ రోజులు గడుస్తున్నా మన శరీరంలో పెద్దగా మార్పులు రాకపోవడం చూసి నిరుత్సాహంతో మళ్లీ పాత జీవనశైలికే అలవాటుపడిపోతాము. కానీ ఊబకాయం ఒక్కరోజులోనో, ఒక్క నెలలోనో ఏర్పడినది కాదన్న నిజాన్ని మనం గ్రహించం. నెలల తరబడి పేరుకుపోయిన అధిక కొవ్వుని కరిగించేందుకు ఒకోసారి ఏళ్లు పడతాయన్ని విషయాన్ని అంగీకరించం. కాబట్టి ఊబకాయాన్ని తగ్గించుకోవాలంటే ముందు కావల్సింది సహనం. కోరుకున్న మార్పుని ఏళ్ల తరబడి ఆచరించే నిబద్ధత!