సంకుచిత ధోరణులకి బలవుతున్న తెలుగు కీర్తి

 

దేశ నాయకుల్నీ, స్వాతంత్ర సమర యోధులను, చివరకి దేవుళ్ళనీ కూడా కులాలవారిగా పంచుకకోగల సంకుచిత మనస్తత్వం పెరిగిపోయిన ఈరోజుల్లో ఒక కళాకారుడిని కళాకరుడిగా, ఒక రాజకీయ నాయకుడిని రాజకీయ నాయకుడిగా మాత్రమే చూడటం చాలకష్టం అని నిరూపిస్తోంది ఈ రోజు హైదరాబాదులో అల్వాల్ జరిగిన సంఘటన. తెలుగువారి కీర్తిని దశదిశలా చాటిన మహానీయుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి కొందరు దుండగులు నిప్పుపెట్టారు.

 

ఆయన తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడయి ఉండవచ్చును. గానీ, ఆయన తనను తానూ తెలుగు ప్రజలకి ప్రతినిధిగా భావించుకొన్నాడే తప్ప, తానో పార్టీకి, కులానికి, ప్రాంతానికి మాత్రమే చెందినవాడినని ఎన్నడూ అనుకోలేదు. తెలుగు బాష, తెలుగు సంస్కృతి, తెలుగు ఆత్మగౌరవం, తెలుగు సినిమా ఇలా తెలుగు జాతికి చెందిన ప్రతీ అంశాలతో ఆయన అనుసంధానంమయ్యారు తప్ప, కులం, పార్టీలకు ప్రాధాన్యం ఈయలేదు.

 

ఆనాడు స్వర్గీయ పీవీ.నరసింహరావు గారు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తుంటే, ఒక తెలుగు వ్యక్తీ ప్రధానమంత్రి అవుతుంటే సాటి తెలుగువాడిగా మనం సహకరించాలి తప్ప అడ్డుపడకూడదు బ్రదర్ అంటూ ఆయనమీద తమ పార్టీ అభ్యర్ధిని పోటీకి నిలబెట్టకుండా ఆయన ఎన్నికకు మార్గం సుగమం చేయడమే రామారావుగారి నిష్కల్మష హృదయానికి చక్కని ఉదాహరణ.

 

రాజకీయాలను, పార్టీలను, కులాల సంకుచిత పోరును, ప్రాంతీయ విద్వేషాలను పక్కన బెట్టి చూస్తే, ఆయనలో కల్మషం లేని ఒక నిజాయితీ పరుడయిన రాజకీయ నాయకుడు కనిపిస్తాడు. తెలుగు చిత్ర సీమలో నభూతో నభవిష్యతి అనదగ్గ మహా నటుడు మనకి కనిపిస్తాడు. తెలుగు బాషాపై ఎనలేని మమకారం గల బాషాభిమాని కనిపిస్తాడు. తెలుగు జాతి ఆత్మగౌరవం డిల్లీలో తాక్కటు పెట్టబడినప్పుడు విలవిలలాడిన ఒక సగటు తెలుగు వ్యక్తీ కనిపిస్తాడు.

 

మరి, అటువంటి వ్యక్తిని కూడా కొందరు కులం, ప్రాంతం, పార్టీ కళ్ళద్దాలలోంచి మాత్రమే చూడగల సంకుచిత దృష్టి కలిగి ఉండటం మన తెలుగు జాతి చేసుకొన్న దౌర్భాగ్యం అని చెప్పక తప్పదు. మన కోసం ఆరాట పడి, మనకొక గుర్తింపును తెచ్చిపెట్టిన మహనీయులను కూడా కుల, మత, ప్రాంత, పార్టీలకు చెందిన వారిగానే విడదీసుకొని ఈ విధంగా అవమానించుకోవడం, వారికి కాదు మనకే సిగ్గు చేటు.

 

 మన తెలుగుదనం, మన జాతి గౌరవం, మన తెలుగు కీర్తిని ఈవిధంగా మనమే చేజేతులా నాశనం చేసుకొంటే, అసలు మనమెవరం? మన చరిత్ర ఏమిటి? మన గొప్పదనం ఏమిటి? అని మన ఉనికిని మనమే ప్రశ్నించుకోవలసిన ఆగత్యం ఏర్పడుతుంది.ఆకాశం మీద ఉమ్మేస్తే అది తిరిగి మన మొహం మీదనే పడినట్లు, మహానీయుల విగ్రహాలను ద్వంసం చేస్తే అది వారి మానసిక దౌర్భల్య స్థితిని బయటపెడుతుంది తప్ప ఆ మహనీయుల కీర్తిని ఇసుమంత కూడా తగ్గించలేదు.