ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంతు.. తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమా?
posted on Nov 8, 2022 @ 9:41AM
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు శాసనసభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. సరే ఆ మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే కొత్త రికార్డులు సృష్టించింది.
ఎన్నికల వ్యయంలో కానీ, పోలింగ్ శాతంలో కానీ గత రికార్డులను బద్దలు కొట్టేసింది. బీజేపీ, టీఆర్ఎస్ లు సొమ్ము వెదజల్లి మరీ గెలుపు ధీమాను ప్రదర్శించడంలో పోటీలు పడ్డారు. కానీ చివరాఖరికి తెరాస బీజేపీపై పై చేయి సాధించి మునుగోడు ఉప ఎన్నికలో తెరాస విజయం సాధించింది.
సరే మునుగోడులో నైతిక విజయం మాదేనని బీజేపీ చెప్పుకుంటోంది. అది వేరే సంగతి. తెరాస విజయానికి కమ్యూనిస్టులతో పొత్తే తెరాస విజయానికి కారణమని బీజేపీ అంటోంది. వంద మంది ఎమ్మెల్యేలు, నాయకులను మోహరించి మునుగోడును ఒక విధంగా అష్టదిగ్బంధనం చేసేసి విపక్షాలను ప్రచారం చేసుకోనీయకుండా పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి సాధించిన ఈ విజయం తెరాసకు వాపే కానీ బలుపు కాదని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.
అదంతా పక్కన పెడితే.. బీజేపీ మాత్రం మునుగోడులో తనకు ఓటు బ్యాంకు బాగా పెరిగిందని సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇదే ఊపుతో మరో ఉప ఎన్నికకు తెరతీయడానికి అప్పుడే తెరవేనుక ప్రయత్నాలు మొదలెట్టేసిందని పరిశీలకులు అంటున్నారు. ఈ సారి అసెంబ్లీకి కాకుండా పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చేలా ప్రణాళిక రూపొందించిందని చెబుతున్నారు.
ఈ సారి నల్గొండ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేత రాజీనామా చేయించి నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చేలా ప్రణాళిక రూపొందించిందంటున్నారు. ఇందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సై అన్నారనీ, త్వరలో ఆయన రాజీనామా చేయడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంత భారీ ఎత్తున ఖర్చు పెట్టిన బీజేపీ, టీఆర్ఎస్ లు నల్గొండ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వస్తే ఇక ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి.