Read more!

బంతి గంటా కోర్టులోనే.. తేల్చుకోవల్సింది ఆయనే!

చేస్తే చీపురుపల్లి నుంచి పోటీ  చేయి, లేకుంటే పార్టీ కోసం పని చేయి.. ఇదీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన సంకేతం. వచ్చే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితా శుక్రవారం (మార్చి 22) విడుదల చేసిన చంద్రబాబు ఈ జాబితాలో గంటా పోటీ చేయాలని భావిస్తున్న భీమిలీ నియోజకవర్గానికీ, అలాగే గంటాను తాను పోటీ చేయమని చెబుతున్న చీపురుపల్లి నియోజకవర్గానికీ అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ లో ఉంచారు.

తద్వారా చంద్రబాబు తన ఉద్దేశమేమిటన్నది స్పష్టంగా చాటారు.  చీపురుపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మంత్రి, ఆ పార్టీ సీనియర్, కీలక నేత బొత్స సత్యాన్నారాయణపై గంటాను పోటీకి నిలబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన   నియోజకవర్గ ఇప్పటికే విస్పష్టంగా గంటాకు తెలియజేశారు. అయితే గంటా మాత్రం తాను విశాఖ జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాననీ, చీపురుపల్లిలో అయితే విజయావకాశాలపై నమ్మకం లేదనీ అంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం  సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయి, గంటా అయితే అక్కడ కచ్చితంగా విజయం సాధిస్తారని అంటున్నారు. ఈ విషయంలో గంటా ఇంకా ఏమీ తేల్చుకోకపోవడంతో తాజాగా విడుదల చేసిన జాబితాలో భీమిలి, చీపురుపల్లి నియోజకవర్గాలను పెండింగ్ లో ఉంచిన చంద్రబాబు నాయుడు ఇక బంతిని గంటా కోర్టులోనే వేశారు.

ఒక వేళ చీపురుపల్లి నుంచి పోటీకి గంటా సంసిద్ధత వ్యక్తం చేయకుంటే ఆయన సేవలను పూర్తిగా పార్టీకి వినియోగించుకుంటామని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.  భీమిలీ, చీపురుపల్లి మాత్రమే కాకుండా చంద్రబాబు మూడో జాబితాలో ఇంకా ఎచ్చర్ల, ధర్మవరం కూడా పెండింగ్ లో ఉంచారు. ఆ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం సీనియర్ నాయకుడు కళావెంకటరావు, పరిటాల శ్రీరామ్ లు పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఈ రెండు స్థానాలూ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు.