కలసి ఉంటే కలదు సంతోషం!
posted on May 27, 2016 @ 11:33AM
కాలేజీ కుర్రవాళ్లను ఎప్పుడన్నా గమనించారా? వాళ్లు ఒక్క నిమిషం కూడా తమ స్నేహితులని విడిచి ఉండేందుకు ఇష్టపడరు. తమ కుటుంబానికి ఎంత విలువని ఇస్తారో, మిత్రబృందానికి కూడా అంతే విలువని ఇస్తారు. ఇక ఆ కుర్రవాళ్లు ఏ క్రికెట్ జట్టులో అన్నా ఉంటే, ఆట ఆడినా ఆడకపోయినా... జట్టంతా ఒకే చోట కనపడుతూ ఉంటుంది. ఒక జట్టుతో కలిసి ఉండటం వల్ల బహుశా ఆ కుర్రవాళ్లు చాలా సంతోషంగా ఉంటారేమో అన్న అనుమానం కలుగక మానదు. ఈ మధ్య జరిగిన ఓ పరిశోధన ఆ అనుమానం నిజమే అని తేలుస్తోంది.
ఇంగ్లండుకి చెందిన నాటింగామ్ ట్రెంట్ విశ్వవిద్యాలయం, మనుషులను సంతోషంగా ఉంచేది ఏమిటి? అంటూ ఒక పరిశోధనని నిర్వహించింది. విశ్వవిద్యాలయానికి చెందిన డా॥ జూలియట్ వేక్‌ఫీల్డ్ ఈ పరిశోధన కోసం 4000 మంది జీవితాలను పరిశీలించారు. వేక్‌ఫీల్డ్ పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే... ఏదన్నా బృందంతో కలిసి ఉండేవారు మిగతావారితో పోలిస్తే సంతోషంగా ఉంటారట. బృందం అంటే ఏదో తూతూమంత్రంగా తీసుకునే సభ్యత్వం కాదు. అలా అనుకుంటే ప్రతి మనిషీ ఏదో ఒక బృందంలో సభ్యుడిగా ఉండే ఉంటాడు. తన కుటుంబంతోనో, మిత్రులతోనో, సత్సంగంలాంటి ఆధ్యాత్మిక సమాజంతోనో, ఆటలు ఆడే జట్టుతోనో, వీధిలోని వారితోనో... ఇలా సమాజంలో ఏదో ఒక భాగంతో కలిసిమెలిసి మెలిగేవారు సంతోషంగా ఉంటారని తేలింది.
ఏదో ఒక బృందంతో అనుబంధంగా ఉండేవారు సంతోషంగా ఉంటారని తేలింది నిజమే! కానీ దానికి కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు సుదీర్ఘమైన జవాబులని ఇస్తున్నారు వేక్‌ఫీల్డ్. ఎంతసేపూ నేనూ, నా జీవితం అనుకుంటే కష్టాలు, సుఖాలు అన్నీ కూడా వ్యక్తిగతమైపోతాయి. అలా కాకుండా నా చుట్టూ ఉన్నవారి బాగోగులను గమనించుకోవాలనే బాధ్యత, నాకేమన్నా అయితే ఇంతమంది ఉన్నారన్న భరోసా... మనిషికి ఏనుగంత బలాన్నిస్తాయట. నలుగురితో కలిసిమెలిసి ఉండటం వల్ల... ఇచ్చిపుచ్చుకునే ధోరణి, కష్టసుఖాలను పంచుకునే అలవాటు ఏర్పడుతుందట. ఇవన్నీ కూడా మనసుకి సంతోషాన్ని కలిగించేవే కదా! పైగా తనలో తాను కృంగిపోయేవారి కంటే నలుగురిలో కలిసిపోయేవారే ప్రశాంతంగా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే మీ చుట్టూ ఉన్న ఏదో ఒక బృందంలో కాస్త కలుపుగోలుగా మెలిగి చూడమంటూ సూచిస్తున్నారు వేక్‌ఫీల్డ్.
వేక్‌ఫీల్డ్ చెప్పిన మాటలు పాశ్చాత్యులకు కొత్తగా కనిపించవచ్చు. కానీ మన భారతీయ సమాజానికి కొత్త కాదు కదా! నిన్న మొన్నటి దాకా ఉమ్మడి కుటుంబాల్లో కలిసి మెలిసి జీవించిన మనకి అందులోనే సంతోషం కనిపించేది. కుటుంబంలోని మిగతావారి ఔన్నత్యమే తన అభివృద్ధి అన్న ఉదారభావంతో ఇంట్లోని వారంతా మెలిగేవారు. కుటుంబాల దాకా ఎందుకు! పల్లెటూళ్లలో ఉండేవారంతా ఒకే కుటుంబంగా మెలుగుతూ ఉండేవారు. ఇక పేరంటాలతోనో, గుడిలో పురాణ కాలక్షేపాలతోనో, రచ్చబండ దగ్గరో నలుగురూ ఒక చోట కలవడం అనేది సర్వసాధారణంగా ఉండిపోయేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేకపోవడమే దురదృష్టం. కలిసి ఉండటంలోని సంతోషం గురించి పాశ్చాత్యులు పరిశోధనలు చేస్తుంటే..... మనం మాత్రం విడిపోయి కష్టాలను కొనితెచ్చుకోవడంలో వారిని అనుసరిస్తున్నాము.
- నిర్జర.