ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కోమాలోకి... బాధ్యతలు చేపట్టిన కిమ్ సోదరి
posted on Aug 24, 2020 @ 10:27AM
ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంత కిమ్ జోంగ్ ఉన్ కోమాలోకి వెళ్లిపోయారని దక్షిణ కొరియా మాజీ అధికారి చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనం సృష్టిస్తున్నాయి. కిమ్ కోమాలో ఉండడంతో ఉత్తర కొరియాలో ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలను ఆయన సోదరి కిమ్ యో జోంగ్ చూస్తున్నారని ఆ అధికారి తెలిపారు. గతంలో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే జంగ్‌కు రాజకీయ సలహాదారుగా పనిచేసిన చాంగ్ సాంగ్ మిన్ తెలిపారు. కిమ్ కోమాలోకి వెళ్లిన విషయాన్ని తమ దేశ గూఢచార వర్గాలు తెలిపాయని అయన పేర్కొన్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన సమాచారం చైనా లోని ఒక ముఖ్య వ్యక్తి నుండి అందినట్లుగా అయన తెలిపారు
ప్రస్తుతం కిమ్ కోమాలో ఉన్నట్టుగా తెలుస్తోందని అయితే ఆయన మరణించలేదని చాంగ్ తెలిపారు. ఈ ఏడాది మొదట్లో కిమ్ చాలా తక్కువసార్లు బయట కనిపించారని, అపుడే ఆయన ఆరోగ్యం క్షీణించిందని అన్నారు. దీంతో దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ సిద్ధంగా ఉన్నట్టు చాంగ్ పేర్కొన్నారు. అయితే కిమ్ బ్రెయిన్ డెడ్ అయినట్టు గతంలో కూడా వార్తలు వచ్చాయి కానీ.. ఆ తర్వాత కిమ్ ఒక ఫెర్టిలాజర్ ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం చేస్తూ బహిరంగంగా కనిపించడంతో ఆ వార్తలకు తెర పడింది. అయితే ఇప్పుడు కూడా మళ్లీ అటువంటి వార్తలే వస్తున్నాయి.