వైసీపీ ఎంపీల్లో సగం మంది ఔట్!
posted on Aug 1, 2022 @ 1:45PM
ఏపీలో వైసీపీ గ్రాఫ్, ఎమ్మెల్యేల పనితీరు దారుణంగా పడిపోతోందని సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ పార్టీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ నేతలు, జిల్లాలు, ప్రాంతీయ ఇన్ చార్జిలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఆ భేటీల్లో తాను స్వయంగా చేయించిన సర్వేల్లో వైసీపీకి వ్యతిరేకంగా వచ్చిన రిపోర్టులపై గుస్సా అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీ మరోసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని, అందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై జగన్ లో అసహనం ఓ రేంజ్ లో పెరిగిపోతున్నట్లు ఉందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు సరిగా లేకపోవడం వల్లే పార్టీకి గడ్డుకాలం ఎదురయ్య పరిస్థితి రాబోతోందని జగన్ వైసీపీ నేతల విషయంలో సలసల కాగిపోతున్నారంటున్నారు.
ఈ క్రమంలోనే జగన్ తన పార్టీలోని ప్రస్తుత ఎంపీల్లో సగం మందికి వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారనే వార్త ఒకటి మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ సగం మంది ఎంపీల పనితీ రు సరిగా లేదని తాను చేయించుకున్న సర్వేల ఫలితాలు చెప్పడంతో జగన్ వారిని తప్పించి కొత్త వ్యక్తులను ఈ సారి బరిలో దింపాలనే నిర్ణయం తీసుకున్నారంటున్నారు. అలా ఈ సారి సీట్లు వచ్చే ఛాన్స్ లేని ప్రస్తుత వైసీపీ ఎంపీల జాబితాలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కాకినాడ ఎంపీ వంగా గీత ఉన్నారన్న గుసగుసలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. ఇక నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎలాగూ రెబెల్ గా మారారు కనుక ఆయన వచ్చే ఎన్నికల నాటికి వైసీపీలో ఉండరు. కనుక టికెట్ ఇచ్చే ప్రశ్నే తలెత్తదు. విజయవాడ ఎంపీ స్థానం నుంచి పి.వరప్రసాద్ మరోసారి టికెట్ ఆశిస్తున్నా కానీ.. ఆయనకు కాకుండా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు ఇస్తే బాగుంటుందని జగన్ యోచిస్తున్నట్లు వైసీపీ నాయకులు అంటున్నారు. అలాగే కడప ఎంపీ, తన కజిన్ అయిన వైఎస్ అవినాశ్ రెడ్డిని ఈ సారి ఎన్నికల్లో ఆ స్థానం నుంచి తప్పించి, పి. మిథుర్ రెడ్డి సిట్టింగ్ స్థానం రాజంపేట నుంచి బరిలో దింపే అవకాశాలను జగన్ పరిశీలిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కడప నుంచి ఈ సారి వైఎస్ కుటుంబానికే చెందిన మరొరికి ఛాన్స్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారన చెబుతున్నారు.
2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి 22 మంది ఎంపీలు ఎన్నికయ్యారు. వారిలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగరేసి, ప్రతి రోజూ వైసీపీని, వైఎస్ జగన్ ను, ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి తదితరులపై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతూనే ఉన్నారు. దాంతో నర్సాపురం పార్లమెంటరీ స్థానం నుంచి ఈ సారి మాజీ ఎంపీ, బీజేపీ నేత గోకరాజు గంగరాజు కుమారుడ్ని బరిలో దింపాలని జగన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు.
ఈ సారి ఎంపీ టికెట్ వచ్చే ఛాన్స్ లేని వారిలో బాపట్ల ప్రస్తుత ఎంపీ నందిగం సురేష్ పేరు ప్రధానంగా వినిపిస్తోందంటున్నారు. తాడికొండ అసెంబ్లీ స్థానం నుంచి ఈ సారి నందిగం సురేష్ ను బరిలో దింపొచ్చంటున్నారు. ఎంపీగా సురేష్ ఉంటే.. ఆ లోక్ సభా నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలపై వ్యతిరేక ప్రభావం పడుతుందని జగన్ అంచనాకు వచ్చారట. సొంత పార్టీ నేతలే పలువురు సురేష్ పట్ల గుర్రుగా ఉన్నారట. దీంతో సురేష్ ను మార్చేయడం తథ్యం అంటున్నారు.
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను వైసీపీ అధిష్టానం ఇప్పటికే పక్కకు పెట్టేసింది. దీంతో శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారంటున్నారు. అమరావతి రాజధానికి శ్రీకృష్ణ దేవరాయలు అనుకూలంగా ఉన్నారనేది వైసీపీ అధిష్టానం నమ్మకమట. అందుకే ఆయన పట్ల చిన్నచూపు చూపుతోందంటున్నారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు జెల్ల కొట్టి ఈ సారి అక్కడ ఓ బీసీ నేతను బరిలోకి దింపాలనేది జగన్ యోచనగా ఉందంటున్నారు.
రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కు కూడా ఈ సారి టికెట్ తుస్సే అని తెలుస్తోంది. పార్టీలో భరత్ కు సఖ్యత లేకపోవడం వల్లే ఈ సారి భరత్ కు భంగపాటు తప్పదంటున్నారు. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పనితీరు అస్సలు బాగోలేదు. అయితే.. ఈ సారి ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఆమె యత్నిస్తున్నారట. కాకినాడ ప్రస్తుత ఎంపీ వంగా గీత విద్యాధికురాలే కానీ.. పార్టీ అధిష్టానం ఆశించినంత మేరకు ఆమె దూకుడుగా వ్యవహరించడంలేదనే భావన బలంగా ఉందంటున్నారు. అందుకే ఈ సారి గీత రాత మారిపోతుందంటున్నారు.
మొత్తానికి ప్రస్తుత వైసీపీ ఎంపీల్లో సగం మంది వరకు ఈ సారి టిక్కెట్లు లభించే అవకాశాలు లేవనే ఊహాగానాలు ఆ పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతుండడం గమనార్హం.