ఎన్నికలయ్యే వరకూ నో సామాజిక పెన్షన్లు? విపక్షాలపై నెపం నెట్టేందుకు జగన్ కుట్ర!?
posted on Mar 26, 2024 @ 10:33AM
వ్యవస్థలను నాశనం చేస్తే పరిస్థితి ఎలా మారుతుందనడానికి ప్రస్తుతం ఏపీ ఒక ఉదాహరణ. గత నాలుగున్నరేళ్లుగా అధికారులను పక్కన పెట్టేసి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ వాలంటీర్ల చేత చేయించిన ఫలితం.. ఇప్పుడు ప్రజలు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెన్షనర్లకు పెన్షన్ అందే పరిస్థితి లేకుండా పోయింది. ఔను ఎందుకంటే ఇంత కాలం పెన్షన్ల పంపిణీ వాలంటీర్ల చేతుల మీదుగా జరిగింది. ఎన్నికల కోడ్ అమలు కావడంతో వారంతా ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలంటూ ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకూ ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన వాలంటూర్లు ఇప్పుడు అలా చేయడానికి వీళ్లేదు. దీంతో పెన్షనర్లకు పెన్షన్లు ఎవరు ఇవ్వాలి? ఈ విషయంలో ఎటువంటి స్పష్టతా లేదు. ప్రభుత్వం అధికారుల చేత పంపిణీ చేయిస్తుందా? అన్నిటికీ బటన్ నొక్కి ఖాతాలలో సొమ్ములు జమవేస్తున్నానని చెబుతున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ పెన్షనర్లకు మాత్రం ఖాతాలతో సంబంధం లేకుండా నేరుగా వాలంటీర్ల ద్వారా సొమ్ములు అందజేశారు. అలా చేయడం వల్ల వారి ఓట్లన్నీ గంపగుత్తగా తన ఖాతాలో పడతాయని భావించారు. ఇప్పుడు వాలంటీర్లు ప్రభుత్వ పథకాల ప్రచారంలో దూరంగా ఉండాలి. అలాగే ఆ పథకాలను ఇళ్లకు తీసుకువెళ్లి అందించేందుకూ వీల్లేదు. ఇప్పుడు పెన్షనర్లకు పెన్షన్లు అందే మార్గమేది? మరో ఐదు రోజులలో ఒకటో తేదీ రానుంది. మరి పెన్షనర్లకు పెన్షన్లు అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవైనా చేశారా?
రాష్ట్రంలో 66 లక్షలమందికి సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు. కొత్తగా 1,17,161మందికి పెన్షన్ కార్డులిచ్చారు. వీరికి ప్రస్తుతం నెలకు 3 వేల రూపాయల పించన్ ఇస్తున్నారు. వృద్ధులు, వితంతులు,ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఎయిడ్స్‌వ్తాధిగ్రస్తులకు నెలకు 3 వేల రూపాయల చొప్పున వాలంటీర్లే.. వారి ఇళ్లకు వెళ్లి పించను ఇస్తున్నారు. ఈసీ ఆదేశాల ప్రకారం..వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకూడదు. ఆ ప్రకారంగా రేపు వచ్చే నెల ఒకటిన, యధావిథిగా వారే పించనర్లకు డబ్బులు చెల్లించే అవకాశం లేదు? ఈ విషయంలో ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి స్పష్టతా లేదు. పోనీ గత ఐదేళ్లుగా అమలు అవుతున్న విధంగానే వాలంటీర్లే పెన్షనర్ల ఇంటికి వెళ్లి పింఛన్లు అందించవచ్చని ఈసీ ఆదేశాలిచ్చే అవకాశాలూ లేవు. ఎందుకంటే వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలేనని మంత్రులు, ఎంపీలు బాహాటంగా ప్రకటనలు గుప్పించేశారు. పార్టీని గెలిపించేందుకే వాలంటీర్లు పని చేయాలని సాక్షాత్తు ముఖ్యమంత్రే ప్రకటించారు. మరి అటువంటప్పుడు ఒక ప్రభుత్వ పథకం లబ్ధిని పార్టీ కార్యకర్తలు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎలా అందజేస్తారు? అలా అందజేయడానికి ఎన్నికల సంఘం అనుమతి ఎలా ఇస్తుంది?
ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వాలంటీర్లపై, ఈసీ చర్యల కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటికే పలువురిపై వేటు వేసింది. ఇటువంటి పరిస్థితుల్లో వాలంటీర్లు సమాజిక పెన్షన్ లబ్ధిదారులకు సొమ్ములు అందించడమంటే.. జగన్ పార్టీకే ఓటు వేయండని ప్రచారం చేయడమే అవుతుందనడంలో సందేహం లేదు. మొత్తం మీద రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకూ సామాజిక పెన్షన్లు అందే అవకాశాలు లేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీ ప్రభుత్వ పథకాల లబ్ధిని నేరుగా ప్రజలకు అందిస్తున్న వలంటీర్ వ్యవస్థపై విపక్షాలు కుట్రపూరితంగా వ్యవహరించి లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందకుండా అడ్డుపడ్డారంటూ వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా ఎన్నికలలో ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తుందని అంటున్నారు.