పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలకు నో జాతీయ హోదా.. స్పష్టం చేసిన కేంద్రం
posted on Mar 29, 2025 @ 2:16PM
తెలంగాణలో అత్యంత కీలకమైన ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్న ప్రతిపాదనను కేంద్రం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఆ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే అవకాశాలు ఇసుమంతైనా లేవని తేల్చేసింది. తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇచ్చే ప్రశక్తి లేదని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని చేసిన విజ్ణప్తిని నిర్ద్వంద్వంగా తిరిస్కరించింది.
కృష్ణా జలాల వివాదం సుప్రీం కోర్టులో ఉన్న నేపథ్యంలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే అవకాశాలు లేవని క్లియర్ కట్ గా చెప్పేసింది. ఈ విషయమై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్ సభలో లేవనెత్తగా, ప్రస్తుతం కృష్ణా జలాల పంపిణీ విషయం కృష్ణా ట్రైబ్యునల్ పరిధిలో ఉండటం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక, పర్యావరణ నివేదికలను పరిగణనలోనికి తీసుకోజాలమని జలశక్తి శాఖ తేల్చేసింది.
ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలంటూ తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను వెనక్కు పంపినట్లు పేర్కొంది. ఈ విషయాలను లోక్ సభ వేదికగా కేంద్రం స్పష్టంగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం నుంచి 2022 సెప్టెంబర్ లో ప్రతిపాదన వచ్చిందని కేంద్రం తెలిపింది. అయితే ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తూ గత ఏడాది డిసెంబర్ లో వెనక్కు పంపినట్లు వివరించింది.