ఉద్యోగుల జీతాలకేనా కరోనా కష్టాలు.. మంత్రుల జీతాలకు లేవా?
posted on Mar 9, 2023 @ 10:31AM
ఏపీలో ప్రభుత్వోద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. మూడో వారంలో కూడా వారు వేతనాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిందే. అయితే వేతనాల జాప్యానికి ప్రభుత్వం కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు సాకుగా చూపుతోంది. అయితే రాష్ట్ర మంత్రులకు మాత్రం ఠంచనుగా ఒకటో తేదీకల్లా వేతనాలు అందేస్తున్నాయి. మరి వారికి వేతనాలు చెల్లించడానికి సర్కార్ చెబుతున్న ఆర్థిక ఇబ్బందులు అడ్డురావా అని ఉద్యోగులే కాదు.. చేసిన పనులకు బిల్లులు రాని కాంట్రాక్టర్లు కూడా నిలదీస్తున్నారు. ఎదుటి వారికి నీతులు చెప్పే వారు ముందుగా దానిని పాటించాలని ఎవరైనా సరే భావిస్తారు. కానీ జగన్ సర్కార్ మాత్రం తాము చెప్పే కష్టాలూ, బాధలూ అన్ని ప్రజలకే కానీ మంత్రులకూ, ప్రభుత్వానికీ కాదని తన చేతల ద్వారా కళ్లకు కట్టినట్లు చూపుతోంది.
కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురై ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు, డీఏలు ఇవ్వలేకపోతున్నామనీ, అంతే కాకుండా వారి న్యాయమైన సమస్యలను కూడా పరిష్కరించలేకపోతున్నామనీ బీద అరుపులు అరుస్తున్న జగన్ సర్కార్ తమ బీద అరుపులన్నీ ఉద్యోగుల జీతాల విషయంలోనే తప్ప మంత్రుల వేతనాల విషయంలో కాదని తేటతెల్లమైంది. ఈ విషయాన్ని ప్రభుత్వమే వెల్లడించింది. సమాచార హక్కు చట్టం కంద ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ కోరిన మేరకు ప్రభుత్వ సహాయ కార్యదర్శి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ హోదాలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో.. కరోనా కాలంలోనూ మంత్రులకు వేలనాలలో పైసా కోత లేకుండా ఠంచనుగా ఒకటో తేదీకల్లా వేతనాలు జమ అయ్యయని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ఇంత వివక్ష, మంత్రుల పట్ల అంత అపేక్ష ఏమిటని సమాజిక మాధ్యమం సాక్షిగా నెటిజన్లు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులంటూ తమకు సకాలంలో వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వం మంత్రులకు మాత్రం ఠంచనుగా వేతనాలు ఎలా చెల్లించగలుగుతోందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ మంత్రులకు ఏ తేదీలో జీతాలు చెల్లిస్తున్నారంటూ.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ గత నెల 2న సమాచార హక్కు చట్టం కింద సాధారణ పరిపాల శాఖకు దరఖాస్తు చేశారు. దానికి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హోదా ఉన్న ప్రభుత్వ సహాయ కార్యదర్శి ఈ నెల 1న సుంకర పద్మశ్రీకి లిఖిత పూర్వక సమాధానం పంపించారు. ఆ సమాధానం మేరకు ఏపీ మంత్రులందరికీ ప్రతి నెల ఠంచనుగా ఒకటవ తేదీనే ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోంది. గత ఏడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకూ ఒకటవ తేదీనే మంత్రులకు జీతాలు చెల్లించామన్నది, అధికారి ఇచ్చిన లేఖ సారాంశం. ప్రభుత్వ అధికారి ఇచ్చిన లిఖిత పూర్వక వివరణను సుంకర పద్మశ్రీ మీడియాముఖంగా వెల్లడించడంతో ఈ విషయం బట్టబయలైంది.
ఓ వైపు తమకు న్యాయబద్ధంగా రావలసిన డీఏలు, అరియర్సుతో పాటు.. ఒకటవ తేదీన జీతాలు, పెన్షన్ల కోసం ఆందోళన చేస్తుంటే.. మంత్రులు మాత్రం ఒకటో తేదీనే జీతాలు తీసుకుంటూ దర్జాగా ఏసీ కా కార్లలో తిరుగుతున్నారని, పైగా వారే తమతో చర్చల సందర్భంగా ప్రభుత్వం కష్టాల్లో ఉందంటూ బీద అరుపులు అరుస్తున్నారని ఉద్యోగులు విరుచుకు పడుతున్నారు. కరోనా కష్టాలు-ఆర్ధిక నష్టాలు మంత్రులకు వర్తించవా అని నిలదీస్తున్నారు.
ఈ ప్రభుత్వం ఉన్నంతవరకూ కరోనా కష్టాలుంటాయని ఓ ఉద్యోగ నేత తాజా చర్చల్లో చేసిన వ్యాఖ్య అబద్ధమేనని, తాజా ఆర్టీఐ లేఖతో రుజువయిందంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు. తమకు ఒకటవ తేదీన జీతాలు-పెన్షన్లు ఇచ్చేందుకు సినిమా కష్టాలు చెబుతున్న సర్కారు.. అదే సినిమా కష్టాలు సచివులకు ఎందుకు వర్తింపచేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటూ చెబుతున్న ‘సలహాదారులు’ ఈ వివక్షకు ఏం సమాధానం చెబుతారని నిలదీస్తున్నారు.