ఏపీకి షాక్.. తెలంగాణలోకి నో ఎంట్రీ.. జగన్‌రెడ్డి ఫెయిల్యూర్!
posted on May 10, 2021 @ 11:34AM
ఆంధ్రప్రదేశ్ కరోనా మహమ్మారికి కేంద్రంగా మారుతోంది. నిత్యం 20వేలకు పైగా కేసులతో దడ పుట్టిస్తోంది. కొత్త రకం వైరస్ అంటూ కూడా వార్తలు వస్తుండటం కలకలం రేపుతోంది. కరోనా కట్టడిలో ప్రభుత్వ అసమర్థత, చేతగాని తనం వల్ల.. ఏపీలో తీవ్ర ఆక్సిజన్ కొరత, హాస్పిటల్స్‌లో బెడ్స్ ప్రాబ్లమ్స్, అంత్యక్రియలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఏపీలో కరోనా విజృంభణ చూసి మిగతా రాష్ట్రాలూ వణికిపోతున్నాయి. ఏపీ ప్రజలను అనుమానంతో చూస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ రాష్ట్రం ఏపీ వాసుల ప్రవేశంపై నిషేధం విధించింది. తాజాగా, మరో తెలుగు స్టేట్ అయిన.. తెలంగాణ సైతం ఏపీ ప్రజలను కట్టడి చేస్తుండటం రాష్ట్రంలో కరోనా తీవ్రతకు నిదర్శనం.
ఏపీ నుంచి వస్తున్న కొవిడ్ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దుతో పాటు.. కర్నూలు జిల్లా పుల్లూరు టోల్‌గేట్ దగ్గర కూడా.. తెలంగాణ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కొవిడ్ రోగులతో వెళ్తున్న అంబులెన్స్‌లను వెనక్కి పంపుతున్నారు. ఏపీలో విస్తృతంగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నందున కొవిడ్ రోగులకు తెలంగాణలోకి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. మిగతా వాహనాలను మాత్రం యథావిధిగా అనుమతిస్తున్నారు. ఇదొక్కటి చాలదా.. ఏపీలో కరోనా కల్లోలం ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి.
మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి రాష్ట్రాలతో పోలిస్తే.. సౌతిండియాలో కరోనా కేసులు ఓ మోస్తారుగా ఉన్నాయి. కానీ, చుట్టు పక్కల మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కొవిడ్ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు పెరగడానికి.. సీఎం జగన్‌రెడ్డి ఉదాసీన వైఖరే కారణమంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సర్కారు ఆలస్యంగా స్పందించడం.. కరోనా కట్టడికి సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ విపత్కర పరిస్థితులంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీలో తీవ్ర ఆక్సిజన్ కొరత, ఆసుపత్రిలో వసతుల లేమితో.. కరోనా రోగులు అల్లాడిపోతున్నారు. అందుకే, హైదరాబాద్‌లోనైనా కాస్త బెటర్ ట్రీట్‌మెంట్ దొరుకుతుందేమోననే ఆశతో అటువైపు వెళుతున్నారు. దీంతో.. ఏపీలో కేసులు పెరుగుతుండటం, కొత్త వైరస్ అంటూ వార్తలు వస్తుండటంతో.. తెలంగాణ పోలీసులు సైతం అప్రమత్తమవుతున్నారు. ఏపీ ప్రభుత్వం చేసిన పాపానికి తమకు ఎందుకు రిస్క్ అనుకున్నారో ఏమో.. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే కొవిడ్ పేషెంట్స్‌ను సరిహద్దుల్లోనే ఆపేస్తున్నారు. అంబులెన్సులను వెనక్కి పంపించేస్తున్నారు. అయితే, అంబులెన్సులను వెనక్కి పంపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అంతరాష్ట్ర రాకపోకలపై నిషేధం ఏమీ లేదు. అయినా, అంబులెన్సులను తెలంగాణలోకి అనుమతించకపోవడం దారుణమంటూ ఏపీ వాసులు మండిపడుతున్నారు. మానవతా ధృక్పదంతోనైనా రోగులతో వచ్చే అంబులెన్సులకు పర్మిషన్ ఇవ్వాలని అడుగుతున్నారు. అందుకు, తెలంగాణ పోలీసులు ససేమిరా అంటుండటం విచారకరం. ఇటు, ఏపీలో సరైన చికిత్స పొందలేక, అటు పక్క రాష్ట్రానికి వెళ్లలేక.. రాష్ట్రంలోని కొవిడ్ పేషెంట్స్ ప్రాణాలతో పోరాడుతున్నారు. తమకు ఎందుకీ కష్టమంటూ పాలకులపై మండిపడుతున్నారు.
అటు.. ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ అమలులో ఉన్న సమయంలో అత్యవసరంగా ప్రయాణించాలనుకొనే వారికోసం ఈ-పాస్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. సోమవారం నుంచి ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. మరోవైపు, అంతర్రాష్ట్ర రాకపోకలపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ప్రస్తుతం ఉన్న షరతులు వర్తిస్తాయని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు.
కరోనా తీవ్రత, కేసుల పెరుగుదల దృష్ట్యా రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతులు ఇవ్వడం లేదని డీజీపీ స్పష్టం చేశారు. శుభకార్యాలకు సంబంధించి మాత్రమే ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం అనుమతులు ఇస్తున్నామన్నారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రాబోయే రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరిస్తామని డీజీపీ హెచ్చరించారు. కరోనాకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్.