మోడీ సర్కార్ కు ఎన్నికల కోడ్ లేదా? వర్తించదా?
posted on Nov 16, 2023 @ 10:25AM
ఎన్నికలకు ముందు వాగ్దానాలు, వరాలు కురిపించడం రాజకీయపార్టీలకు మామూలే. అవి అమలు చేయగలమా? లేదా? అన్న విషయం పట్టించుకోకుండా.. ఎన్నికలలో ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా పార్టీలు ఆకాశమే హద్దుగా హామీలు గుప్పించడం కొత్తేమీ కాదు. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత సంయమనం పాటించాలి. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలూ ఓటర్లకు ఆకస్మిక ధనలాభం చేకూర్చే వాగ్దానాలు చేయరాదు. ఎన్నికల సంఘం ఇటువంటి వాగ్దానాలపై కన్నేసి ఉంచాలి. అయితే ఆ పని ఎన్నికల సంఘం సక్రమంగా చేస్తోందా అంటే అనుమానమే అన్న సమాధానమే వస్తుంది.
ఎందుకంటే ఇటీవల ఛత్తీస్ గఢ్ ఎన్నికల సభలో ప్రధాని మోడీ ఉచిత నిత్యావసర వస్తువుల పంపిణీ పథకాన్ని మరో అయిదు సంవత్సరాలు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద కోవిడ్ సమయంలో దేశంలోని 80 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందే విధంగా ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ పథకాన్ని 2022డిసెంబర్ నెలలో జాతీయ ఆహార భద్రతా చట్టంలో విలీనం చేసి, మరో ఏడాది పాటు పొడిగించారు. ఆ పథకం ఈ ఏడాది డిసెంబర్ నెలతో ముగుస్తోంది. అటువంటి పథకాన్ని మరో అయిదేళ్లు పొడిగించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ చత్తీస్ గఢ్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఆయన ఈ ప్రకటన చేయడం ప్రజానీకాన్నే కాకుండా కేంద్రం లోని అధికారులు, మంత్రులను సైతం రెండు విధాలుగా ఆశ్చర్యానికి గురిచేసింది. దేశ జనాభాలో సుమారు 60 శాతం మందికి వర్తించే ఈ బృహత్తర పథకాన్ని ఎకాయెకిన అయిదేళ్లపాటు పొడిగించడం ఈ ఆశ్చర్యానికి ఒక కారణమైతే.. ఆ ప్రకటన చేయడానికి ఆయన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణాన్ని ఉపయోగించుకోవడం మరో కారణం.
కచ్చితంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో అనుచిత లబ్ధి పొందే దురాలోచనతోనే మోడీ ఎన్నికల ప్రచార సభలో ఈ ప్రకటన చేశారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అసలు ఎన్నికల నిబంధనలు అనేవి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ కు వర్తించవా? అని నిలదీస్తున్నాయి. ఆ ప్రకటనపై ఇప్పటి వరకూ ఎన్నికల సంఘం ఎటువంటి స్పందనా లేకుండా మౌనం వహించడాన్నీ ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం లేదనడానికి ఇంత కంటే ఉదాహరణ కావాలా అని మండి పడుతున్నాయి. మోడీ ఎన్నికల నిబంధనలను ఇసుమంతైనా లెక్క చేయరనడానికి ఇంతకు ముందు కూడా పలు ఉదంతాలు రుజువులుగా ఉన్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన పోలింగ్ బూత్ లో ఓటు వేసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ ఎన్నికల చిహ్నమైన కమలాన్ని చేతిలో పట్టుకున్నారు. ఆ సమయంలో ఆ తీరును ప్రశ్నించిన మీడియాకు ఆయన తాను కమలం పువ్వును కాకుండా, హస్తం గుర్తును పట్టుకుంటానా అని ఎదురు ప్రశ్నించారు. అప్పట్లో ఈ విషయంపై ఎన్నికల సంఘం నోటీసులు కూడా ఇచ్చింది. ఆ తరువాత వాటి సంగతి ఏమై ఉంటుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. ఇక ప్రస్తుతానికి వస్తే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉచిత బియ్యం పథకాన్ని ఏకంగా ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ఈ ఎన్నికలలోనే కాకుండా వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో కూడా ప్రయోజనం పొందడమే లక్షయంగా కనిపిస్తోంది. అంతే కాకుండా ఈ ప్రకటన ద్వారా మోడీ తన ద్వంద్వ వైఖరిని తానే చాటుకున్నారు.
దేశంలో పేదరికం ఇదివరకటి స్థాయిలో లేదని మోడీ సర్కార్ చాలా కాలంగా చెబుతూ వస్తున్నది. తన ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లలో 13 13.50 కోట్ల మంది పేద ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకు వచ్చినట్టు మోడీ సర్కార్ ప్రకటించారు. ఇప్పుడు దేశంలో 60 శాతం మందికి మరో ఐదేళ్ల పాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తామంటూ మోడీ ఎన్నికల ప్రచార సభలో ప్రకటించడం ద్వారా.. దేశంలో పేదరికం తగ్గడం మాట అటుంచి మరింత పెరిగిందని ఆయనే చెప్పినట్లు అయ్యింది. నిజంగానే దేశంలో పేదరికం తగ్గినట్లైతే ఈ పథకాన్ని ఎందుకు ప్రకటించినట్లు? వాస్తవానికి ప్రపంచ బ్యాంకు కూడా భారతదేశంలో పేదరికంగా బాగా తగ్గిపోయిందని గణాంకాలతో సహా వెల్లడించింది. 2004లో 39 శాతానికి పైగా ఉన్న పేద ప్రజానీకం 2019 నాటికి 12.7 శాతానికి తగ్గిపోయినట్టు పేర్కొంది. అదే నిజమైతే ఇన్ని కోట్ల మందికి ఉచితంగా బియ్యం సరఫరా చేయడం ఎందుకు? ఎందుకంటే నిస్సందేహంగా ఎన్నికల లబ్ధి కోసమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయిదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రధానమంత్రి విధాన ప్రకటన చేయడం కచ్చితంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనే అని అంటున్నారు. అయితే బీజేపీ, మోడీ మాత్రం దీనిని ఎన్నికల వాగ్దానాల్లో భాగమని బుకాయిస్తోంది. మిగిలిన పార్టీలు ఎన్నికల వాగ్దానాలు చేస్తున్నట్టే తాము కూడా వాగ్దానం చేశామని వాదిస్తోంది. ఎన్నికల సంఘం మాత్రం మౌనం వహిస్తోంది.