తెలంగాణలో ముందస్తు ఇక లేనట్లే!
posted on Jul 11, 2022 @ 2:44PM
ఉభయ తెలుగు రాష్ట్రాలలో ముందస్తు ఎన్నికల చర్చ, చాలాకాలంగా సాగుతోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి అయితే, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో ముడి పెట్టి, వచ్చే సంవత్సరం మే నెలలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, జూన్ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఖాయమన్నరీతిలో పార్టీని, క్యాడర్ ను సన్నద్ధం చేస్తున్నారు. ఆలశించిన ఆశా భంగం అన్న తీరున ఇతర పార్టీల నుంచి అభ్యర్ధులను పట్టుకొచ్చుకుంటున్నారు.
అలాగే, బీజేపీ నాయకులు కూడా ముందస్తుకు సిద్ధమన్న సంకేతాలు ఇస్తున్నారు. ఇటీవల జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పరోక్షంగానే అయినా, ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమని సంకేతాలు ఇచ్చారు. ఎన్నికలకు ఎప్పుడు వెళతారో మీ ఇష్టం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా, విజయం మాత్రం బీజేపీదే అని కేసీఆర్ ను ఉద్దేశించి పేర్కొన్నారు. అలాగే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్, బీజేపీ ఇతర కీలక నేతలు కూడా ఈ రోజుకు ఈ రోజు ఎన్నికలు వచ్చినా .. ఢీ అంటే ఢీ అనేందుకు, రెఢీగా ఉన్నామని ప్రకటనలు చేస్తున్నారు.
అయితే, ముందస్తు ఎన్నికల ఆలోచన, అవసరం రెండూ తెరాసకు లేవని, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇంతకు ముందు అనేక మార్లు స్పష్టం చేశారు. కానీ, తాజాగా, ముఖ్యమంత్రి కేసేఅర్ ప్రతిపక్ష పార్టీలు ముందస్తు ఎన్నికలకు సిద్ధమైతే.. అసెంబ్లీని రద్దు చేయడానికి తాను కూడా సిద్ధమేనని సవాలు విసిరారు. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలకు ముందస్తుకు వెళ్లే ధైర్యముందా..? అని కేసీఆర్ ప్రతిపక్ష పక్ష పార్టీల నాయకులను ఎద్దేవా చేశారు. అయితే, చాంతాడంత రాగం తీసి చివరకు అదేదో పాట పాడినట్లు, ముఖ్యమంత్రి సవాలు చేసి, ప్రతిపక్షాలను ఎద్దేవ చేసి, చివరకు, తానూ అసెంబ్లీ రద్దు చేయాలంటే, అందుకు షరతులు వర్తిస్తాయి అన్నారు. బీజేపీ ముందుగా ఎన్నికల తేదీలను ఖరారు చేసి, ముందస్తుకు వస్తే, తాను అసెంబ్లీ రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దమని స్పష్టం చేశారు.
ఆంటే ముందస్తుకు వెళ్ళడమా అలేదా అనేది నిర్ణయించే అధికారం తమ చేతుల్లో లేదని కొంచెం ఆలస్యంగానే అయినా ముఖ్యమత్రి గుర్తించారని, పరిశీలకులు అంటున్నారు. అయితే ఎప్పుడైతే ముఖ్యమంత్రి, ముందస్తుకు షరతులు వర్తిస్థాయనే మాట అన్నారో, అప్పుడే ఆయన, ముందస్తు ఎన్నికల ఆలోచన నుంచి వెనకడుగు వేశారనే విషయం స్పష్టంగా తెలిసి పోయిందని, విశ్లేషకులు భావిస్తున్నారు. 2018 లో ముందస్తుకు వెళ్లేముందు, ఆయన ప్రతిపక్షాల అనుమతి తీసుకుని ముందస్తుకు వెళ్ళారా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే, రోజు రోజు కు ఇంటా బయట సమస్యలు చుట్టుముట్టి, ఇబ్బందులు పెడుతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగానే ఉన్నారని, అయితే, అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం, వెంటనే ఎన్నికలు ప్రకటించక పోయినా, కేంద్ర ప్రభుత్వం ఏదో వంకన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినా, పరిస్థితులు చేజారిపోయే ప్రమాదం లేక పోలేదని, ముఖ్యమంత్రి సందేహిస్తున్నారని అంటున్నారు. సో .. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఇక లేనట్లేనని, పరిశీలకులు భావిస్తున్నారు.