నితీష్ ఐక్యతా యత్నాలు ఫలించేనా?.. కేసీఆర్ కలుస్తారా?
posted on Apr 24, 2023 @ 12:56AM
విపక్షాల ఐక్యత కోసం బీహార్ సీఎం నితీష్ కుమార్ తన ప్రయత్నాలను పట్టువదలని విక్రమార్కుడిలా కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన ఆర్జేడీనేత, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ తో కలిసి.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో భేటీ అయ్యారు. విపక్షాల ఐక్యత విషయంలో ఇంకెంత మాత్రం జాప్యం తగదని ఆయన అంటున్నారు.
కోల్ కతాలో మమత బెనర్జీతో భేటీ అయిన నితీష్ దీదీతో చర్చలు సానుకూల వాతావరణంలో సాగాయని చెప్పారు. విపక్ష నేతలంతా కలిసి వ్యూహరచన చేస్తే మంచిదని మమత చెప్పారనీ, బీజేపీని జీరో చేయడమే లక్ష్యంగా విపక్షాల ఐక్యత ఉండాలన్నదే లక్ష్యం కావాలని అన్నారు. లోక్ నాయక్ డాక్టర్ జయప్రకాశ్ నారాయణ ఉద్యమం కూడా బీహార్ నుంచే ప్రారంభమైందన్న నితీష్ కుమార్, ఇప్పుడు కూడా విపక్షాల ఐక్యతా యత్నాలకు బీహార్ నుంచే నాది పలకాలని ఆకాంక్షించారు. విపక్షాల ఐక్యతకు సంబంధించి అఖిల పక్షం బీహార్ లో నిర్వహించాలని మమతా బెనర్జీ కూడా సూచించారని నితీష్ కుమార్ తెలిపారు.
ఐతే.. కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం అంటే ఇటీవలే అఖిలేష్, మమతలు సంయుక్త ప్రకటన చేసిన నేపథ్యంలో బీహార్ లో కాంగ్రెస్, ఆర్జేడీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న జేడీయే అధినేత నితీష్ కుమార్ కాంగ్రెస్ సారథ్యంలో విపక్షాల ఐక్యత కోసం చేస్తున్న ప్రయత్నాలకు మమత సుముఖంగా స్పందించారని చెప్పడం విశేషం. అయితే నితీష్ ఇప్పటి వరకూ చేసిన ఐక్యతా యత్నాలన్నీ ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్న చందంగానే సాగాయి. ఈ నెల 12న జయప్రకాశ్ నారాయణ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. ఆ భేటీలో కాంగ్రెస్ సహా బీజేపీయేతర పార్టీల ఐక్యతకు సంఘీభావం ప్రకటించిన కేజ్రీవాల్ ఆ తరువాత వారం వ్యవధిలోనే ఆప్ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇప్పుడు నితీష్ తో భేటీకి చాలా రోజుల ముందే బీజేపీ, కాంగ్రెస్ లకు సమదూరం అని ప్రకటించిన మమత ఇప్పుడు నితీష్ సమక్షంలో కాంగ్రెస్ సహా విపక్షాల ఐక్యతకు మద్దతు ఇస్తామని ప్రకటించారు.
కోల్ కతా నుంచి నేరుగా లక్నోవెళ్లి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో భేటీ అయిన నితీష్, తేజస్వి ప్రసాద్ లు ఆయనతోనూ ఐక్యతపై చర్చించారు. కాగా కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏలో కొనసాగుతున్నారు. ఎన్సీపీ, ఉద్దవ్ శివసేన ఇప్పటికే కాంగ్రెస్ కూటమిలోనే ఉన్నాయి. స్టాలిన్ కూడా యూపిఏ భాగస్వామిగానే ఉన్నారు. బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక దాదాపు అన్ని కూటములకూ దూరంగా ఉన్నారు. అసలు బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య కూటమి అంటూ తొలుత అడుగులు వేసిన కేసీఆర్ ఇప్పుడు ఆ విషయంలో నోరు మెదపడం లేదు. మొత్తం మీద వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఓటమి అన్నది ఆ పార్టీని వ్యతిరేకించే రాజకీయ శక్తులను అనివార్యమైన అవసరంగా మారిందనడంలో సందేహం లేదు.